Share News

Telangana: మా ఇంట్లో ఎవరూ లేరూ.. నువ్వు వచ్చెయ్.. సీన్ కట్ చేస్తే..

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:38 AM

అప్పటికే ఆమెకు పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త, పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో వేసిన తప్పటడుగులు కటకటాల పాలు చేసింది. జీవితమే అంధకారం అయింది.

Telangana: మా ఇంట్లో ఎవరూ లేరూ.. నువ్వు వచ్చెయ్.. సీన్ కట్ చేస్తే..

అప్పటికే ఆమెకు పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త, పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో వేసిన తప్పటడుగులు కటకటాల పాలు చేసింది. జీవితమే అంధకారం అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మరిపల్లి గ్రామానికి చెందిన పద్మకు శేఖర్ అనే వ్యక్తితో చిన్న వయసులోనే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇదే గ్రామానికి చెందిన మహేందర్‌ హార్వెస్టర్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో పద్మకు అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజుల క్రితం పద్మ తన ప్రియుడు మహేందర్ తో కలిసి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్ తో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పద్మను పట్టుకున్నారు. ఠాణాకు తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

అతనితోనూ మనస్పర్థలే..

అయినప్పటికీ భర్త శేఖర్ తో కలిసి ఉండేందుకు పద్మ నిరాకరించింది. మహేందర్ తో వెళ్లిపోయింది. కొన్నాళ్లు బాగానే ఉన్నాక పద్మ మహేందర్ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి కాస్తా తీవ్రంగా మారడంతో పద్మ తన పుట్టింటికి వచ్చేసింది. తల్లితో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో మహేందర్‌ అక్కడికి వస్తుండేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన పద్మ మహేందర్ ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. భార్య తిరిగి తన దగ్గరకు వస్తుందన్న ఆనందంతో అతనూ సరేనన్నాడు. భర్త, తల్లిదండ్రులతో కలిసి మహేందర్ ను హత్య చేయాలని పద్మ ప్లాన్ వేసింది. మహేందర్‌కు ఫోన్‌ చేసి ఇంట్లో ఎవరూ లేరు రమ్మని పిలిచింది. ఆమె మాటలు నమ్మిన మహేందర్ పద్మ తల్లిగారింటికి వెళ్లాడు.


కళ్లల్లో కారం చల్లి..

అదను కోసం ఎదురు చూస్తున్న పద్మ కుటుంబీకులు మహేందర్ కళ్లల్లో కారం చల్లి కర్రలతో చితకబాదారు. దెబ్బలు తాళలేక మహేందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి కాలుతున్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెన్నూరు సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోలీసుల రంగ ప్రవేశంతో భయపడిపోయిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 11:38 AM