Share News

TG Govt: ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు..

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:15 AM

రాష్ట్రంలో మరిన్ని ఎకరాల భూమికి సాగునీరందించే దిశగా రాష్ట్ర సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

TG Govt: ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు..

  • ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

  • రెండేళ్లలోపు కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పూర్తి చేయాలన్న లక్ష్యం

  • ప్రాధాన్య జాబితాలోకి 19 ప్రాజెక్టులు

  • వీటి నిర్మాణానికి 19,289 కోట్ల వ్యయం

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరిన్ని ఎకరాల భూమికి సాగునీరందించే దిశగా రాష్ట్ర సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా ఏటా 6 లక్షల నుంచి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టులను ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఈ ఏడాది వంద శాతం పూర్తయ్యే ప్రాజెక్టును కేటగిరీ-ఏ కింద చేర్చారు. రానున్న కాలంలో పూర్తయ్యే ప్రాజెక్టులను కేటగిరి-బీ, సీ, డీ కిందికి తెచ్చారు. నీటిపారుదల శాఖకు ఈ ఏడాది (2024-25)లో రూ.28 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.


ఇందులో రూ.18 వేల కోట్లు రుణాల చెల్లింపులు, రూ.2,500 కోట్ల దాకా వేతనాలకు పోను.. రూ.8 వేల కోట్లలో కొన్ని పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తూ కొత్తగా ప్రాధాన్య జాబితాలో పెట్టుకున్న ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూ పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. వచ్చే పదేళ్లపాటు వివిధ ప్రాజెక్టుల కింద తీసుకున్న అప్పులకు అసలు/వడ్డీలు కట్టడానికే అత్యధికంగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కార్పొరేషన్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు ప్రక్రియ 2035 ఆగస్టులో పూర్తికానుంది. కాళేశ్వరం రుణం తీరితేనే ప్రభుత్వంపై భారం తగ్గి ఊపిరి పీల్చుకోనుంది.


ఈ నేపథ్యంలో ఏటా పరిమిత బడ్జెట్‌తో ప్రాధాన్య జాబితాలో పెట్టిన ప్రాజెక్టుల కింద సాగునీరు అందించాలని నిర్ణయించింది. ఈ రెండేళ్లలో మొత్తం 19 ప్రాజెక్టులను ప్రాధాన్య జాబితాలో పెట్టి, వీటి నిర్మాణానికి రూ.19,289 కోట్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 4.51 లక్షల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉండగా... మరో 1.78 లక్షల ఎకరాలు సాగులోకి రాలేదు. దాంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. రెండేళ్లలోపు కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీని కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.


ఆ ప్రాజెక్టులకే ప్రాధాన్యం...

సదర్‌మట్‌ బ్యారేజీ కింద 18,600 ఎకరాలు, నీల్వాయి ప్రాజెక్టు కింద 13 వేలు, చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వర్‌) కింద 45 వేలు, మొడికుంటవాగు కింద 14 వేలు, చనకా కొరాటా కింద 51 వేలు, శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కింద 1,64 లక్షల ఎకరాలు, దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 5.57 లక్షల ఎకరాలు, సీతారామ ఎత్తిపోతల పథకం కింద 3.20 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం కింద 46 వేల ఎకరాలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 4.51 లక్షల ఎకరాలు, గట్టు-తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టును సృష్టించడం, కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకం కింద లక్ష ఎకరాలు, డిండి ఎత్తిపోతల పథకం కింద 3.06 లక్షల ఎకరాలు, శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంకు కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) కింద 4.12లక్షల ఎకరాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతంగా చేపట్టడం, జవహర్‌ నెట్టెంపాడు, రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకాలతోపాటు శ్రీరాంసాగర్‌ రెండో దశను పూర్తిచేయడం వంటివి ప్రాధాన్య ప్రాజెక్టులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీరు అందించే లక్ష్యాలు చేరుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - Jul 09 , 2024 | 03:15 AM