Share News

Hyderabad: ఆర్‌ అండ్‌ బీలో ‘రిటైర్మెంట్ల చిచ్చు’!

ABN , Publish Date - May 26 , 2024 | 04:58 AM

రోడ్లు, భవనాల శాఖలో పదవీ విరమణల అంశం చిచ్చు రేపుతోంది. ఈ నెల 31 నుంచి డిసెంబరు వరకు వివిధ హోదాల్లోని 37 మంది రిటైర్‌ కాబోతున్నారు. వారిలో కొంతమంది తమకు ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

Hyderabad: ఆర్‌ అండ్‌ బీలో ‘రిటైర్మెంట్ల చిచ్చు’!

  • ఈ నెల 31 నుంచి డిసెంబరు వరకు 37 మంది పదవీ విరమణ

  • ఎక్స్‌టెన్షన్‌ కోరుతున్న పలువురు అధికారులు, ఉద్యోగులు

  • ఇవ్వొద్దంటూ సీఎం, మంత్రికి లేఖ రాసిన ఇంజనీర్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖలో పదవీ విరమణల అంశం చిచ్చు రేపుతోంది. ఈ నెల 31 నుంచి డిసెంబరు వరకు వివిధ హోదాల్లోని 37 మంది రిటైర్‌ కాబోతున్నారు. వారిలో కొంతమంది తమకు ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో రిటైర్‌ కాబోయే అధికారులకు ఎక్స్‌టెన్షన్‌ కానీ కన్సల్టెంట్లుగా కానీ అవకాశం ఇవ్వొద్దని కోరుతూ ఆర్‌ అండ్‌ బీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ సీఎం రేవంత్‌ రెడ్డి, ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ రాసింది.


ఆ లేఖకు ఇంజనీర్ల సంతకాలతో కూడిన మరో రెండు పేజీలు కూడా జతపరచడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రిటైర్‌ కాబోయే అధికారులు వర్సెస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌లా పరిస్థితి మారిపోయింది. శాఖలో ఏండ్ల తరబడి పదోన్నతులు లేకపోగా.. రాష్ట్ర విభజన అనంతరం పదోన్నతులకు సంబంధించి ఏపీ నుంచి రావాల్సిన సీనియారిటీ జాబితా ఇప్పటికీ ఖరారు కాలేదు, రాలేదు. ఫలితంగా 34ఏళ్ల క్రితం ఏఈఈలుగా చేరిన వారు ఇప్పటికి డిప్యూటీ ఈఈ హోదాకు మాత్రమే వచ్చారు. మరోవైపు గత ప్రభుత్వం ఆర్‌ అండ్‌ బీలో ఏడేళ్ల క్రితమే రిటైర్‌ అయిన ఇద్దరు ఉద్యోగులకే మళ్లీ ఈఎన్‌సీలుగా బాధ్యతలు ఇచ్చింది. దీంతో ఇతర అధికారులకు ఆశించిన మేర పదోన్నతులు దక్కలేదు.


అప్పటి మాదిరిగా రిటైరైన వారికి వెంటనే ఎక్స్‌టెన్షన్‌, కన్సల్టెంట్‌గా మళ్లీ అవకాశం కల్పిస్తే తాత్కాలిక పదోన్నతుల జాబితాలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని ఆర్‌ అండ్‌ బీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ చెబుతోంది. మరోవైపు ప్రస్తుతం రిటైర్‌ అవుతున్న వారిలో ఇన్‌చార్జి ఈఎన్‌సీ సహా మరికొంతమందికి మూడు నెలల క్రితమే పదోన్నతి దక్కింది. వారు మరికొంతకాలం శాఖలో పనిచేయాలనే భావనతో ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుటుందనేది తేలాల్సి ఉంది.

Updated Date - May 26 , 2024 | 04:58 AM