Share News

Sankranti: కుటుంబాలతో గడిపేందుకు సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు మీ కోసమే..

ABN , Publish Date - Jan 13 , 2024 | 09:21 AM

పండగ అంటేనే సంబురం. అలాంటిది సంక్రాంతి అంటే.. ఆ సందడి మామూలుగా ఉండదు. విద్య, ఉద్యోగ ఉపాధి కోసం ఎక్కడెక్కడో

Sankranti: కుటుంబాలతో గడిపేందుకు సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు మీ కోసమే..

పండగ అంటేనే సంబురం. అలాంటిది సంక్రాంతి అంటే.. ఆ సందడి మామూలుగా ఉండదు. విద్య, ఉద్యోగ ఉపాధి కోసం ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తుంటారు. కుటుంబమంతా కలిసి స్వస్థలాలకు పయనమవుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు నగరానికి వచ్చి తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తాళం వేసి వెళ్లాలని, అవసరం అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో చోరీల నియంత్రణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చోరీలు జరగకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.

స్కూటర్, కార్ డిక్కీలలో విలువైన వస్తువులు పెట్టకూడదు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. రోడ్లపై నిలపకూడదు. బీరువా తాళాలు ఇంట్లో ఉంచరాదు, వెంట తీసుకెళ్లాలి. ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. ఆరు బయట పెట్టే వాహనాలకు హ్యాండిల్ లాక్‌తోపాటు వీల్ లాక్ వేయాలి. టైమర్లతో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం మంచిది. క్కువ రోజులు ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలి. పనిమనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.


ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సార్‌లను ఉపయోగించడం మంచిది. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లను ఉపయోగించండి. ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. సెన్సార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్ వెలుగుతుంది. విలువైన వస్తువుల సమాచారం, వ్యక్తిగత ఆర్థిక విషయాలు ఇతరులకు చెప్పాకూడదు. ఇంటికి ధృడమైన, నాణ్యమైన తలుపులతోపాటు హై ఎండ్ గోద్రెజ్ లాక్ సిస్టంను వాడాలి. సొంత ఇల్లు వారు ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండంచెల భద్రతనిస్తుంది.

అనుమానిత వ్యక్తుల కదలికలను పోలీసులకు చెప్పాలి. ఊర్లకు వెళ్లే వారు చుట్టుపక్కల వారితోపాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. నమ్మకమైన సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్‌లను నియమించుకోవాలి. కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని వాచ్‌మెన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీస్ స్టేషన్ నంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నంబర్ దగ్గర పెట్టుకోవాలి.


ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం సులభం. రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలి.అపార్టుమెంట్ వాచ్‌మెన్లకు తెలపాలి. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉండాలి.

Updated Date - Jan 13 , 2024 | 09:43 AM