Share News

Lok Sabha Polls: నల్లగొండలో జెండా పాతేదెవరో!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:09 AM

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు సమానస్థాయిలో ప్రాతినిధ్యం దక్కింది. నియోజకవర్గానికి మొత్తం 17 పర్యాయాలు ఎన్నికలు జరిగితే, సీపీఐ, కాంగ్రెస్‌ చెరి ఏడు పర్యాయాలు గెలుపొందాయి. తెలంగాణ ప్రజాసమితి ఒకసారి విజయం సాధించగా..

Lok Sabha Polls: నల్లగొండలో జెండా పాతేదెవరో!

  • పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మక పోరు

  • దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గం

  • ఐదోసారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌

  • ఇక్కడినుంచే పునర్‌వైభవం సాధించాలని బీఆర్‌ఎస్‌

  • బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బీజేపీ ప్రయోగం

  • రైతాంగ సమస్యలే ఎజెండాగా ఆసక్తికర పోరు

ప్రజా చైతన్యానికి ప్రతీక. ఒకప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌కు (Congress) మధ్య హోరాహోరీ పోరుకు వేదికగా నిలిచిన ప్రాంతం. తెలంగాణ ఉద్యమ ప్రభావంలోనూ బీఆర్‌ఎ్‌సను గెలిపించని పార్లమెంటు స్థానం. ఇలాంటి విలక్షణ తీర్పులనిచ్చిన నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచీ కొత్త అభ్యర్థులే బరిలోకి దిగుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఐదోసారి గెలిచి నల్లగొండను తమ కంచుకోటగా చాటుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఉవ్విళ్లూరుతుండగా, పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్నట్లుగా బీఆర్‌ఎస్‌ పోరాడుతోంది. ప్రధాని నరేంద్రమోదీ మేనియా తమకు కలిసొస్తుందనే విశ్వాసంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు!?

abn.jpg

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు సమానస్థాయిలో ప్రాతినిధ్యం దక్కింది. నియోజకవర్గానికి మొత్తం 17 పర్యాయాలు ఎన్నికలు జరిగితే, సీపీఐ, కాంగ్రెస్‌ చెరి ఏడు పర్యాయాలు గెలుపొందాయి. తెలంగాణ ప్రజాసమితి ఒకసారి విజయం సాధించగా, టీడీపీ రెండుసార్లు గెలిచింది. బీఆర్‌ఎ్‌సకి, బీజేపీకి ఇక్కడ ఇప్పటివరకు ప్రాతినిధ్యం దక్కలేదు. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గట్టిపోటీ ఇచ్చినా.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈసారికూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యనే పోటీ ఉంటుందని తొలుత భావించారు. కానీ, అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కీలక పోటీదారుగా నిలిచింది. కాంగ్రెస్‌ నుంచి దిగ్గజ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పోటీచేస్తుండగా, బీఆర్‌ఎస్‌ నుంచి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి బరిలో నిలిచారు. ఈ ముగ్గురు అభ్యర్థులూ లోక్‌సభకు మొదటిసారే పోటీ చేస్తుంటే, రఘువీర్‌, కృష్ణారెడ్డి ఎన్నికల బరిలో నిలవడమే మొదటిసారి. సైదిరెడ్డికి మాత్రం ఎమ్మెల్యేగా మూడుసార్లు పోటీచేసిన అనుభవం ఉంది. ఇక గత ఎన్నికల్లో పోటీచేసిన ముగ్గురు అభ్యర్థులూ ఈసారి ఇక్కడ పోటీలోనే లేకపోవడం మరో విశేషం.


రైతాంగమే ప్రధాన ఎజెండా..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, ఏఎమ్మార్పీ, స్వల్పభాగం ఎస్‌ఆర్‌ఎస్పీ కింద ఆయకట్టు కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, మెట్టప్రాంతాలూ ఉన్న నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో రైతాంగమే ప్రధాన ప్రభావిత వర్గంగా ఉంది. ఈ నియోజకవర్గ పరిఽధిలో వరిసాగు ఎక్కువగా ఉండగా, బత్తాయి పండ్లతోటలు సాగు గణనీయమైన విస్తీర్ణంలో ఉంది. కీలకమైన ఓటుబ్యాంకు రైతాంగమే కావడంతో ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు రైతాంగ సమస్యలే ఎజెండాగా మాట్లాడుతున్నారు. ధాన్యానికి మద్ధతు ధరతోపాటు వచ్చే సీజన్‌ నుంచి రూ.500 బోనస్‌ ఇస్తామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నియోజకవర్గ పరిఽధిలోకి వచ్చే ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పూర్తికి తమ ప్రభుత్వం వచ్చాకే నిధులు కేటాయించి పనులు వేగవంతం చేశామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దీంతోపాటు డిండి ఎత్తిపోతల పథకాన్ని, నక్కలగండి ప్రాజెక్టును పూర్తిచేస్తామని, బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌ పూర్తి చేయిస్తామని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేసి సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతున్నారు. కాగా, తమ హయాంలో చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసిందనే వాదనను బీఆర్‌ఎస్‌ వినిపిస్తోంది. రైతులకు అండగా ఉండేందుకు, పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు వీలుగా నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని బీజేపీ చెబుతోంది.


రికార్డు గెలుపు కోసం కాంగ్రెస్‌ కసరత్తు

నల్లగొండ నుంచి ఐదోసారి గెలుపొందడం కోసం కాంగ్రెస్‌ శ్రమిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి రికార్డు స్థాయి మెజారిటీ తెస్తామని మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి ప్రకటించారు. లోక్‌సభ పరిధిలోని 7స్థానాలకుగాను 6చోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉండడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం కానుంది. రఘువీర్‌రెడ్డి ఎన్నికల్లో మొదటిసారే పోటీచేస్తున్నప్పటికీ జానారెడ్డి తనయుడిగా ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో సుపరిచితుడు. ఉద్దండులైన నేతలంతా ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో తండ్రి జానారెడ్డి సూచనల మేరకు రఘువీర్‌ అందరినీ సమన్వయం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రె్‌సకు దిగ్గజ నేతలున్న నల్లగొండలోనే ఆ పార్టీకి షాకివ్వాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ తొలిసారి నల్లగొండ పర్యటనకే వచ్చారు.. కృష్ణాజలాల అంశంపై ఒకసారి, కరువు నేపథ్యంలో పంటల పరిశీలనకు మరోసారి పర్యటించారు. రాజకీయ కుటుంబానికే చెందిన కంచర్ల కృష్ణారెడ్డిని ఇక్కడ బరిలోకి దింపారు. పోటీలో నిలిచింది మొదటిసారే అయినప్పటికీ కృష్ణారెడ్డికి బీఆర్‌ఎస్‌ శ్రేణులతో, మాజీ ఎమ్మెల్యేలతో విస్తృతస్థాయి సంబంధాలున్నాయి. ఇక మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు వస్తుందనే నినాదంతో రంగంలోకి దిగిన బీజేపీ, ఈసారి ఇక్కడ సంప్రదాయ విధానాలకు స్వస్తిచెప్పింది. గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపింది.


లంబాడ, యాదవ సామాజికవర్గాల ఓట్లు కీలకం

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో సామాజికవర్గాల పరంగా లంబాడ గిరిజనులే అత్యఽధిక ఓటుబ్యాంకు కలిగి ఉన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో విస్తరించిన ఈ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో కీలకమైన యాదవ సామాజికవర్గ ఓటర్లు కూడా నియోజకవర్గంలో ప్రభావవంతమైన ఓటుబ్యాంకు కలిగి ఉన్నారు. వీరితోపాటు దళితుల ఓట్లు కీలకం కానున్నాయి. మైనారిటీలతోపాటు పద్మశాలి, మున్నూరుకాపు, ముదిరాజ్‌ సామాజికవర్గాల ఓట్లు గణనీయంగా ఉండడంతో ఆ వర్గాలపైనా అభ్యర్థులు దృష్టి సారించారు.

Updated Date - Apr 25 , 2024 | 09:26 AM