Share News

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:14 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు అయ్యింది. ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన విచారణ వాయిదా పడింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!
MLC Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి చుక్కెదురు అయ్యింది. ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా సెలవులో ఉండటంతో.. విచారణని వాయిదా వేయడం జరిగింది. ఈనెల 22 లేదా 23 తేదీల్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వాదనలు విననుంది. కాగా.. కవితను రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు.

స్నేహితులతో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!


ఇదిలావుండగా.. లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిందని, ఇందులో రాజకీయ కక్ష సాధింపు ఉందని ఆ పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. తాను ఈడీ కేసు దర్యాప్తుకు సహకరిస్తున్నానని.. మహిళగా, వైద్యపరమైన కారణాలు, బీఆర్ఎస్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె కోరారు. ఈడీ అరెస్ట్‌తో తాను సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. అయితే.. ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. లిక్కర్ కేసులో ఆమెది ప్రధాన పాత్ర అని.. బెయిల్ ఇస్తే సాక్షుల్ని, ఆధారాలను ప్రభావితం చేస్తుందని ఈడీ వాదిస్తోంది.

మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

కాగా.. మనీలాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఆమెను కోర్టులో హాజరుపరచగా.. రెండు దఫాలుగా మొత్తం 10 రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. మార్చి 26న ఆమె కస్టడీ ముగియడంతో.. ట్రయల్ కోర్టు ఆమెకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే.. ఆయా కారణాలు చెప్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత రెండుసార్లు పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒక పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు రెండో పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. మంగళవారం విచారణ జరగాల్సింది కానీ, జడ్జి సెలవులో ఉండటంతో వాయిదా పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 03:30 PM