Share News

Hyderabad: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:39 AM

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అట్లాంటాలోని కోకాకోలా హెడ్‌ క్వార్టర్స్‌లో ఆ కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో సమావేశమయ్యారు.

Hyderabad: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

  • కోకాకోలా గ్రూప్‌ డైరెక్టర్‌ను కోరిన మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అట్లాంటాలోని కోకాకోలా హెడ్‌ క్వార్టర్స్‌లో ఆ కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకాకోలా యాజమాన్యాన్ని మంత్రులు ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎక్కడ ప్లాంట్‌ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని కోకాకోలా ప్రతినిధులకు మంత్రులు హామీ ఇచ్చారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని జోనథన్‌కు వివరించారు.


తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానంపట్ల సానుకూలంగా స్పందించిన జోనథన్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. కాగా, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో తెలంగాణ పరిశ్రమల బృందం శుక్రవారం అట్లాంటాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌ సీటీవో నారాయణన్‌ కృష్ణకుమార్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని, ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలూ కల్పిస్తుందని శ్రీధర్‌బాబు వివరించారు. ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణకుమార్‌, డెల్టా ఏవియేషన్‌ టీమ్‌.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరగా.. డెల్టా ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.

Updated Date - Jun 08 , 2024 | 03:39 AM