Share News

Uttam Kumar Reddy: 28లోగా పనులు పూర్తవ్వాలి!

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:12 AM

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్ణీత వ్యవధిలోగా మరమ్మతులు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మరమ్మతు పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Uttam Kumar Reddy: 28లోగా పనులు పూర్తవ్వాలి!

  • మరమ్మతులు ఆలస్యమైతే కఠిన చర్యలు

  • రేయింబవళ్లు పనులు చేయండి

  • బ్యారేజీల పరిశీలనలో అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌

  • నివేదికలు అందాక బాధ్యులపై చర్యలు!

  • తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మిస్తాం

  • లక్ష్మి పంప్‌హౌస్‌లో 11 మోటార్లకు మరమ్మతులు చేయిస్తామని వెల్లడి

  • సుందిళ్ల బ్యారేజీ పనుల్లో తీవ్ర జాప్యం

  • రేయింబవళ్లు పనులు చేయండి

  • బ్యారేజీల పరిశీలనలో అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌

  • (మేడిగడ్డ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్ణీత వ్యవధిలోగా మరమ్మతులు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మరమ్మతు పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ప్రకారం మరమ్మతు పనులు జరుగుతున్న తీరును తెలుసుకోవడానికి శుక్రవారం ఆయన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును, బ్యారేజీల స్థితిగతులను ఆరా తీశారు. హైదరాబాద్‌ బేగంపేట విమానశ్రయం నుంచి హెలికాప్టర్‌లో తొలుత సుందిళ్ల చేరుకున్న ఆయన.. బ్యారేజీ వద్ద సీసీ బ్లాకులను ఒకేచోటికి చేర్చుతున్న పనులు పరిశీలించారు. ఈ నెల 28లోగా పనులు పూర్తికావాలన్నారు. సుందిళ్లలో పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వానాకాలం ముంచుకొస్తున్నందున పనులు వేగిరం చేయాలని ఆదేశించారు. రేయింబవళ్లు పనులు చేస్తేనే వరదలు వచ్చేలోపు బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పూర్తవుతాయని అధికారులకు స్పష్టం చేశారు.


సిమెంట్‌ బెంట్నెట్‌ గ్రౌటింగ్‌తో పరిష్కారం

ఏటా వరదల సమయంలో అన్నారం బ్యారేజీలో అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌లలో లాంఛింగ్‌ ఆఫ్రాన్లు, సీసీ బ్లాకులు దెబ్బతింటున్నాయని అధికారులు మంత్రికి నివేదించారు. దీనికి కారణమేంటని మంత్రి ప్రశ్నించగా.. డిజైన్లలో లోపాలేనని అధికారులు చెప్పారు. తగిన డి జైన్లతో పనులు చేయాలని గత ముఖ్యమంత్రికి నివేదించినా పట్టించుకోలేదని, ఫలితంగా ఏటా వరదలు వచ్చే సమయంలో గేట్లు తెరిచేటప్పుడు ప్రవాహ వేగంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుందని గుర్తుచేశారు. సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకుల స్థానంలో సిమెంట్‌ బెంట్నెట్‌ గ్రౌటింగ్‌తో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అఫ్కాన్‌ ప్రతినిధులు తెలిపారు. ఇక అన్నారం బ్యారేజీపై పార్సన్‌ సంస్థ నివేదిక తప్పుల తడకగా ఉందని చెప్పిన ఈఎన్‌సీ.. మరమ్మతులన్నీ ఎన్‌డీఎ్‌సఏ సిఫారసుల ప్రకారమే జరగాలని నిర్మాణ సంస్థకు సూచించారు.


అన్నారంలో ఎప్పట్లోగా పనులు పూర్తవుతాయని మంత్రి నిర్మాణ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా.. 15 రోజుల్లోగా పూర్తిచేస్తామని చెప్పారు. బ్యారేజీలో పరీక్షలు ఎక్కడిదాకా వచ్చాయని మంత్రి ఆరా తీయగా.. దీనికి రూ.1.13 కోట్లు కావాలని కేంద్ర విద్యుత్తు, నీటి పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) అంచనాలు సమర్పించిందని తెలిపారు. ఒక్కరోజులో చెల్లింపులు చేస్తామని, బిల్లులు పంపించాలని మంత్రి వారికి సూచించారు. అన్నారం బ్యారేజీ ఎగువ, దిగవ భాగంలో ఏటా భారీగా ఇసుక మేటలు వస్తున్నాయని అధికారులు చెప్పగా.. ఇసుక తరలింపునకు సంస్థలను ఎంపిక చేయాలని ఉత్తమ్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా సుందర్‌శాల గ్రామస్థులు మంత్రిని కలిసి, అన్నారం వరద నుంచి రక్షణకు కరకట్టలు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఉత్తమ్‌.. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి, ప్రతిపాదనలు అందించాలని గ్రామస్థులకు సూచించారు.


మేడిగడ్డకు తదుపరి నష్టం జరగకుండా చూసుకోవాలి

అన్నారం బ్యారేజీ పరిశీలన అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న మంత్రి ఉత్తమ్‌.. అంబట్‌పల్లి గ్రామంలో నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున మరింత నష్టం జరగకుండా చూడాలన్నారు. మరమ్మతు పనులు వేగిరం చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బ్యారేజీలోని ఏడో బ్లాకును ఉత్తమ్‌ పరిశీలించారు. ఏడో బ్లాకులోని పునాది కింద నుంచి భారీగా ఇసుక కొట్టుకుపోయి.. గొయ్యి ఏర్పడిందని, దీన్ని పూడ్చడానికి వీలుగా ఇసుక, సిమెంట్‌ గ్రౌటింగ్‌ చేశామని నిర్మాణ సంస్థ తెలిపింది. గ్రౌటింగ్‌ అనంతరం 16, 17 గేట్లను ఎత్తామని, మిగిలిన గేట్ల కింద గ్రౌటింగ్‌ జరుగుతోందని, డౌన్‌స్ట్రీమ్‌లో షీట్‌ పైల్స్‌(ఉక్కు రేకులు) దించుతున్నామని, సీసీ బ్లాకులను కూడా సరిచేస్తున్నామని వెల్లడించింది. ఇక 20వ నంబర్‌ గేటును కత్తిరించి ముక్కలు తొలగిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇక కుంగిన బ్లాకు కింది నుంచి ఇసుక కొట్టుకుపోయినందున.. గ్రౌటింగ్‌ శరవేగంగా చేయాలని, వరదలు వచ్చేలోపు గేట్లన్నీ తెరిచి ఉంచి, బ్లాకుల కింద ఉన్న సీపేజీని కట్టడి చేయాలని నిర్దేశించారు. కాగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎన్‌డీఎ్‌సఏ, జ్యుడీషియల్‌ కమిషన్‌ ఇచ్చే తుది నివేదికల ప్రకారం బాధ్యులపై చర్యలు ఉంటాయని చెప్పారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ పరీక్షలు జరిగాయి.


రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి.. ఎకరాకు నీళ్లివ్వలేదు: ఉత్తమ్‌

భూపాలపల్లి/మంథని రూరల్‌, జూన్‌ 7: గత ప్రభుత్వం రూ.94 వేల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికి రాకుండా పోయిందని ఉత్తమ్‌ చెప్పారు. బ్యారేజీల పరిశీలన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. గత సర్కారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి, ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని ఆరోపించారు. మూడింట్లో రెండు బ్యారేజీలు సీరియస్‌ లీకేజీల సమస్య ఎదుర్కొంటుండగా, కుంగిపోయిన మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు తాత్కాలిక ఏర్పాట్లు చేసి, రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత నదిపై తుమ్మడిహెట్టి బ్యారేజీని నిర్మించి తీరతామని స్పష్టం చేశారు. లక్ష్మి (కన్నెపల్లి) పంప్‌హౌ్‌సలో దెబ్బతిన్న 11 మెటార్లకు కూడా మరమ్మతులు చేయిస్తామని ఉత్తమ్‌ చెప్పారు. కాళేశ్వరం జాతీయ హోదా విషయంలోనూ గత ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా అబద్ధాలు చెప్పిందన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, తాను ప్రధానిని కలిసి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరగా.. జాతీయ హోదా అనే పద్ధతి లేదని, కేంద్రం నుంచిఆ ప్రాజెక్టుకయ్యే 60 శాతం ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

Updated Date - Jun 08 , 2024 | 05:12 AM