Share News

Harish Rao: ఆ రిపోర్టు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిందే.. హరీశ్ రావు హాట్ కామెంట్స్

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:38 PM

కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా పాలమూరుకు వెళ్లారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలననైనా నిజాయితీగా చేయాలని హితవు పలికారు.

Harish Rao: ఆ రిపోర్టు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిందే.. హరీశ్ రావు హాట్ కామెంట్స్

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా పాలమూరుకు వెళ్లారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలననైనా నిజాయితీగా చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ పాలనలో కల్వకుర్తి ద్వారా కేవలం 13వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చారని చెప్పారు. గత కేసీఆర్ పాలనలో 3లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని తెలిపారు. మేడిగడ్డపై రెండు రోజులకే NDSA రిపోర్ట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశం కూడిన రిపోర్ట్ అని మండిపడ్డారు. రైతుల కోసమే తాము ఛలో మేడిగడ్డ చేపట్టామని స్పష్టం చేశారు. పది వేల కోట్లతో మొదలైన పోలవరం పూర్తి కావాలంటే లక్ష కోట్లు కావాలి అంటున్నారని చెప్పారు. అందులో కూడా కేంద్రం అవినీతి ఉందా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి ఉద్యమానికి ద్రోహం చేసిన చరిత్ర ఉందన్నారు. తమ మీద కేసులు పెట్టండి హింసించండి..కానీ రైతు ప్రయోజనాలు దెబ్బ తీస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. చిల్లర మల్లర ప్రయత్నాలు చేయొద్దన్నారు. తాము నల్గొండ సభ పెడితే.. కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ టూర్ పెట్టుకున్నారని.. ఇప్పుడు మళ్లీ తాము మేడిగడ్డ వెళ్తున్నప్పుడే పాలమూరుకు వెళ్లారని మండిపడ్డారు. తమ యాత్ర విజయం అయిందని హరీశ్‌రావు తెలిపారు.

మేఘా ప్రాజెక్ట్‌లో సాంకేతిక ఇబ్బందులు సహజం....

‘‘మా ఒత్తిడికి ప్రభుత్వం దిగి వస్తుంది. రిపేర్ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం మా పాక్షిక విజయం. కాంగ్రెస్ కుట్రలు బయట పెట్టి ప్రజలకు ప్రాజెక్ట్‌పై వాస్తవాలు చెప్పడానికే మేము పర్యటించాం. కాంగ్రెస్ రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. మేఘా ప్రాజెక్ట్‌లో సాంకేతిక ఇబ్బందులు సహజం.. రాజకీయాలకు ఇది సమయం కాదు. రైతులకు నీళ్లు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చలకు అఖిల పక్షాన్ని పిలిస్తే.. మా సలహాలు ఇస్తాం. కాళేశ్వరం పడగొడితే బీఆర్‌ఎస్‌ను పడగొట్టచ్చనే కుటిల ప్రయత్నం చేస్తున్నారు. వందేళ్ల దూరపు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్‌కు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఈపీఐ విధానం తెచ్చి అవినీతికి తలుపులు తెరిచింది కాంగ్రెస్. ప్రాణహితకు శంకుస్థాపన చేసి ఏడేళ్లయినా ఎందుకు పని చేయలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతగా మాట్లాడాలి. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవు కాబట్టే ప్రాణహిత డిజైన్ మార్చాం.. ప్రతిపాదిత డబ్బుతో పూర్తి అయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పండి. కాళేశ్వరంతో 20లక్షల ఎకరాలకు నీరు ఇచ్చాం. కానీ ఆయకట్టు తగ్గించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....

Updated Date - Mar 01 , 2024 | 10:38 PM