KTR: మేడిగడ్డ బరాజ్‌ను ఒకరిద్దరు మంత్రులు ఏమైనా చేయగలరు
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:53 AM
‘‘మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటులో కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలున్నాయి. లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చెక్కుచెదరని బరాజ్‌కు ఎన్నికల ముందే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది!? ఇకపై ఆ బరాజ్‌కు ఏం జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమేనని భావించాల్సి ఉంటుంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

వారికి ఎవరెవరితో సంబంధాలున్నాయో మాకు తెలుసు: కేటీఆర్
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘‘మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటులో కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలున్నాయి. లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చెక్కుచెదరని బరాజ్‌కు ఎన్నికల ముందే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది!? ఇకపై ఆ బరాజ్‌కు ఏం జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమేనని భావించాల్సి ఉంటుంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎ్‌సఎల్పీలో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసునని, వారు బరాజ్‌ను ఏమైనా చేయగలరని ఆరోపించారు. 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకున్న మేడిగడ్డ బరాజ్‌పై తప్పుడు నివేదికలు ఇవ్వడం సరికాదని, అది ఎన్‌డీఎ్‌సఏ రిపోర్టు కాదని, ఎన్డీయే రిపోర్టని మండిపడ్డారు.
కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని కాంగ్రెస్ ప్రభుత్వమే విఫలమైందన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకపోతే బీఆర్‌ఎస్ తరఫున తామే ఆ పని చేస్తామని ప్రకటించడంపై కేసీఆర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో తమకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామని హెచ్చరించారు. సీఎం చుట్టూ ఉండే ఉదయసింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తెలంగాణలో షాడో క్యాబినెట్ నడుపుతున్నారని విమర్శించారు. ఉదయ్ స్కీం పత్రం చూపించి మోటార్లకు మీటర్లకు సంబంధించిన ఒప్పందం అంటూ మభ్యపెడుతున్నారన్నారు.
కాళేశ్వరం నిర్మాణం, బతుకమ్మ చీరల పంపిణీలోనూ సీఎం రేవంత్ రెడ్డికి స్కామ్‌లు కనబడుతున్నాయని తప్పుబట్టారు. బతుకమ్మ చీరలే కాదని, తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేటిపైనైనా విచారణ జరుపుకోవచ్చని సవాల్ చేశారు. పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎల్‌అండ్ టీ గురించి అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తీరు బాగోలేదని తప్పుబట్టారు. ధరణి స్థానంలో ఏది వచ్చినా భూమేతే అవుతుందని, ఎక్కడేం జరుగుతుందో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణానికి రూ.వేల కోట్ల నిధులిచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. బీజేపీకి 8 ఎంపీ సీట్లిచ్చిన తెలంగాణకు మొండి చేయి చూపిందని విమర్శించారు.