Share News

Congress: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష నేడు..

ABN , Publish Date - Apr 14 , 2024 | 07:25 AM

కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు.

Congress: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష నేడు..

కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆదివారం దీక్ష (Initiation) చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు. కాగా మరో ఆరు రోజుల్లో పార్లమెంట్‌ (Parliament) ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification) జారీ అయి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటున్నది. రెండు రోజులుగా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ (Congress vs BJP)గా మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ (Bandi Sanjay Kumar) ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తిచేసుకున్నా విభజన హామీలను విస్మరించిందని, దానికి నిరసనగా ఈరోజు కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో దీక్ష చేపడతానని పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయనకు దీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధం కావడం రాజకీయ కలకలాన్ని సృష్టిస్తున్నది.

పరస్పర ఆరోపణలు

విభజన హామీలను విస్మరించిన బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని, ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని పొన్నం ప్రభాకర్‌ విమర్శిస్తున్నారు. గడిచిన పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకున్నారని ఆయన విమర్శించారు. రామడి ఫొటోలు, అక్షింతలు ఇంటింటికి పంపడం మినహా ప్రతి ఇంటికి ఏమి చేశారో చెప్పాలని, బీజేపీకి చేతనైతే రాముడి బొమ్మతో కాకుండా మోదీ బొమ్మతో ఓట్లు అడగాలని పొన్నం సవాల్‌ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ తమతమ నియోజకవర్గాల్లో ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పొన్నం ప్రభాకర్‌ దీక్షా ప్రకటనను ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తీవ్రంగా దుయ్యబట్టారు. పదేళ్లుగా ఈ విషయంలో పొన్నం ప్రభాకర్‌ ఏం చేశాడని, ఇప్పుడు దీక్ష ఎందుకు చేస్తానంటున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేళ్ళ కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, వాటికి నిరసనగా ధమ్ముంటే తెలంగాణ భవన్‌ వద్ద దీక్ష చేయాలని పొన్నంకు సవాల్‌ విసిరారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నందుకు నిరసనగా గాంధీ భవన్‌ ఎదుట ధర్నా చేయాలని ప్రభాకర్‌ను డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో అన్నివర్గాలు దగాకు గురైతే ఒక్కనాడు కూడా ఎందుకు దీక్ష చేయలేదని, మద్దతు ధర రాక వడ్ల కుప్పలపై బడి రైతులు గుండె పగిలి చస్తుంటే ఎందుకు దీక్షలు చేయలేదని పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించారు. నరేంద్ర మోదీ 80 కోట్ల మంది పేదలకు ఏళ్ల తరబడి ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకు దీక్ష చేస్తావా..., దేశ ప్రజలందరికీ కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చినందుకు దీక్ష చేస్తావా ప్రజలకు వివరించాలని సంజయ్‌ పొన్నంను ప్రశ్నించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి 12 వేల కోట్ల నిధులు ఇస్తున్నందుకు దీక్ష చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అభ్యర్థే దొరకని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అపరమేధావి కలిసి తనను ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ను తానే అభివృద్ధి చేశానంటున్న పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌కు ఎందుకు పారిపోయారో ఆయన కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎందుకు డిపాజిట్‌ రాకుండా చేశారో జవాబివ్వాలని ఆయన సవాల్‌ విసిరారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రజల్లోకి వెళుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి బీజేపీ గెలుపును అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బీజేపీని గెలిపించాలని బండి సంజయ్‌కుమార్‌ ప్రజలకు వివరిస్తున్నారు.

రోజురోజుకు మారుతున్న సమీకరణాలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనని చేసిన ప్రచారం చేసింది. ఇప్పుడు బీజేపీ అదే అస్ర్తాన్ని సంధిస్తూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అంటూ ప్రచారం చేయడం కరీంనగర్‌లో కొత్త సమీకరణాలకు తెరతీసే అవకాశం కనిపిస్తున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే ప్రచారంలో ఎంతో ముందంజలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీ అధిష్ఠానం ఇంకా కరీంనగర్‌ అభ్యర్థి ఎవరో ఖరారు చేయక పోవడం మైనస్‌గా మారింది. కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక పోతున్నదని, అసలు అభ్యర్థే లేడని ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉందని బీజేపీ చేస్తున్న ప్రచారం ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నది.

Updated Date - Apr 14 , 2024 | 07:30 AM