Justice NV Ramana: ‘భాష’ ధ్యాస ఉన్నవారికే ఓట్లు
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:53 AM
‘‘భాషాభివృద్ధికి పాటుపడే నేతలకు మాత్రమే ఓట్లు వేస్తామని ప్రజలు నిర్ణయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు భాషకు పట్టం కడతాయి. ప్రభుత్వాలు పెద్దపీట వేస్తాయి.

ప్రజలు ఆ దిశగా అడుగులేయాలి.. అప్పుడే భాషకు ప్రభుత్వాల పెద్దపీట
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ
విజయవాడలో ఘనంగా ప్రారంభమైన
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
విజయవాడ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘భాషాభివృద్ధికి పాటుపడే నేతలకు మాత్రమే ఓట్లు వేస్తామని ప్రజలు నిర్ణయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు భాషకు పట్టం కడతాయి. ప్రభుత్వాలు పెద్దపీట వేస్తాయి. భాష ధ్యాస ఉన్నవారికే ఓట్లు వేయాలి’’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు భాషా రచయితలు, కవులు, భాషాభిమానులు ఎన్ని మహాసభలు నిర్వహించినా, ఎన్ని నినాదాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ పరిస్థితిని మార్చే ఆయుధం ప్రజల ఓటేనని స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘భాషాభిమానం ఉన్నవారు ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఉన్నప్పుడు భాషకు న్యాయం జరుగుతుంది. రచయితలు దివిటీపట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే రచనలు చేయాలి. రచయితలు.. ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు, రివార్డులు మరిచిపోయి రచనలు చేయాలి. భాష అంతరించిపోతే పత్రికలు చదివేవారు, చానళ్లు వీక్షించేవారు కూడా ఉండరు.
పత్రికలు, చానళ్లు భాషాభివృద్ధికి పాటుపడాలి. భాష విషయంలో తమిళనాడులో ఉన్న ఐక్యత తెలుగు ప్రజల్లోనూ రావాలి. ఏపీలో వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 85ను కూటమి సర్కారు రద్దు చేయాలి. దీనికి సంబంధించి గుంటుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు జీవోను రద్దు చేసింది. అయినా, వైసీపీ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎ్‌సఎల్పీ) దాఖలు చేసింది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో తిరిగి భాషా ప్రాధికార సంస్థను నెలకొల్పాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం వేధించిన వారిలో తాను కూడా ఒక బాధితుడినేనని జస్టిస్ ఎన్వీ రమణ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తెలుగు భాష అభివృద్ధి, పాఠశాలల్లో తెలుగు మాధ్యమం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగును అణగదొక్కడానికి గత ప్రభుత్వం జీవో 85ను తీసుకొచ్చిందన్నారు. ఆ ప్రభుత్వంలో అనేక ఘటనలు జరిగాయని, వాటిలో తాను కూడా ఒక బాఽధితుడిగా మిగిలానని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్.తులసిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు మాధ్యమంలో చదువుతున్నవారికి విద్య, ఉద్యోగాల్లో 3-5ు అదనపు మార్కులు ఇవ్వాలని కోరారు. ఈ విధానాన్ని అమలు చేస్తే తెలుగు భాష మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు.
దేశంలో ఒకప్పుడు రెండోస్థానంలో ఉన్న తెలుగు భాష నాలుగో స్థానానికి పడిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని, ప్రజలు దీనికోసం పోరాటం చేయాలని, అవసరమైతే తానే నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు. తాను ఎప్పటికీ తెలుగు బిడ్డనేనని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగు పత్రికల సర్క్యులేషన్ పెరిగేలా పత్రికల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీగా ఢిల్లీలో ఉంటున్నా తనకు చదవడానికి తెలుగు పత్రిక దొరకలేదని చెప్పారు. తమిళులకు ఇబ్బంది వస్తే ఆ సమాజం మొత్తం రాజకీయాలకతీతంగా స్పందిస్తుందని, అదే ఐక్యత తెలుగు జాతిలోనూ రావాలని ఆయన ఆకాంక్షించారు. హైకోర్టు జడ్జి జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. శాసనాల ద్వారా సమాజాన్ని కొంతవరకే నియంత్రించగలమని, అధిక శాతం మార్పు రావాలంటే సాహిత్యం ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. ఇలాంటి సభలు జరగడం ద్వారా తెలుగు భాష పరిపుష్ఠం కావడంతోపాటు సాహిత్యం, పద్యం, గద్యం, కథ, కథానికలు వంటి కవితా ప్రక్రియలన్నీ చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.
ఆధునికతను ఆహ్వానిస్తూనే ‘అమ్మ’ను కాపాడుకోవాలి: గోరటి వెంకన్న
సమాజంలో రోజురోజుకూ వస్తున్న ఆధునికతను ఆహ్వానిస్తూనే మాతృభాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో రైతులు 1,000 రకాల ధాన్యాల పేర్లను చకచకా చెబుతారని, మార్కెట్ శక్తులు మొట్టమొదట దాడి చేసేది భాష మీదేనని చెప్పారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.