Share News

Hyderabad: భాగ్యనగరంలో నీటి కుట్రలు? వారి పనేనా?

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:11 AM

హైదరాబాద్‌లో(Hyderabad) కృత్రిమ కొరత సృష్టించి జలమండలిని(HMWSSB) తద్వారా ప్రభుత్వాన్ని బద్‌నాం చేసేందుకు ‘నీటి కుట్రలు’ పన్నిన్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సరిపడా నీళ్లున్నప్పటికీ సరఫరా చేయకపోవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది.

Hyderabad: భాగ్యనగరంలో నీటి కుట్రలు? వారి పనేనా?
Hyderabad Water Crisis

  • హైదరాబాద్‌లో సరిపడా నిల్వలున్నా సరఫరా చేయని వైనం

  • ట్యాంకులు పొంగిపొర్లుతున్నప్పటికీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం..!

  • కొన్ని ప్రాంతాలకు అధికంగా.. మరికొన్నిచోట్లకు సరఫరా అసలే లేదు

  • గంట నుంచి గంటన్నరకు గాను నలభై నిమిషాలతోనే సరి

  • జీఎం, డీజీఎం, మేనేజర్ల కనుసన్నల్లో లైన్‌మన్ల ఎత్తుగడలు

  • ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు

  • జలమండలికి ఝలక్‌ ఇస్తున్నవారిపై దృష్టి సారించిన విజిలెన్స్‌ విభాగం

నిరుడు మండు వేసవి నుంచి మొన్నటి ఫిబ్రవరి వరకు హైదరాబాద్‌ నగర వాసులకు జల మండలి రోజుకు 2,500 మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేసింది. ప్రస్తుతం 2,610 మిలియన్‌ లీటర్లను అందిస్తోంది. 110 మిలియన్‌ లీటర్లు అధికం సరఫరా చేస్తున్నా.. పలు ప్రాంతాలకు అరకొరగానే వస్తున్నాయి. పలుచోట్ల వచ్చిన నీరు వచ్చినట్లుగా సరఫరా చేయకపోవడంతో ట్యాంకులు నిండిపోయి నీరంతా కిందకు దుముకుతున్నాయి. నాలుగు రోజుల క్రితం దుండిగల్‌ మల్లంపేట ట్యాంక్‌లోకి చేరిన నీటిని సరఫరా చేయనే లేదు. దాంతో పూర్తిగా నిండిపోయి గంటపైగా వృథాగా పోయాయు.

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో(Hyderabad) కృత్రిమ కొరత సృష్టించి జలమండలిని(HMWSSB) తద్వారా ప్రభుత్వాన్ని బద్‌నాం చేసేందుకు ‘నీటి కుట్రలు’ పన్నిన్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సరిపడా నీళ్లున్నప్పటికీ సరఫరా చేయకపోవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది. వివిధ జలాశయాల నుంచి రోజుకు 2,600 మిలియన్‌ లీటర్ల నీటిని తీసుకొస్తున్నప్పటికీ లోటు పడుతుండడంతో ఏం జరుగుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. కొందరు లైన్‌మెన్ల్లు రాజకీయ పార్టీలకు పావుగా మారి.. ప్రభుత్వం మారిన నేపథ్యంలో నీటి కష్టాలు మొదలయ్యాయనే ప్రచారానికి ఊతమిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలకు అధికంగా సరఫరా చేస్తూ కాలనీలు, బస్తీలకు ఇవ్వడం లేదని తెలిసింది. మణికొండ, గచ్చిబౌలి సిద్ధిఖీనగర్‌, చందానగర్‌లోని కొన్నిచోట్ల, మెహదీపట్నం హిల్‌ కాలనీ, టోలీచౌకీలోని నదీంకాలనీ, ఎర్రగడ్డ ఇలా పలు ప్రాంతాలకు సక్రమంగా సరఫరా కావడం లేదు. వచ్చినా లో ప్రెజర్‌ ఉంటోంది. ఈ తంతు కొందరు జీఎంలు, మరికొందరు డీజీఎంలు, పలువురు మేనేజర్ల కనుసన్నల్లోనే సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల మణికొండ డివిజన్‌ జీఎంను బదిలీ చేశారు. ఆ స్థానంలో వచ్చిన జీఎంకు ఉద్యోగులెవరూ సహకరించలేదని తెలిసింది. పలు ప్రాంతాలకు సరఫరా కూడా నిలిపివేసి కొత్త తలనొప్పులు సృష్టించినట్లు సమాచారం. ఉన్నత స్థాయి ఒత్తిళ్లు, ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో చివరకు పాత జీఎంను కొనసాగించారు.

ఎవరికి వారిదే ఇష్టారాజ్యం..

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని 1.30 కోట్ల జనాభాకు జల మండలి తాగు నీరు సరఫరా చేస్తోంది. భూగర్భ జలాలపై కాకుండా ఆధారపడకుండా వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, మంజీరా, గోదావరి జలాలను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తప్ప సరఫరాకు ఇబ్బందులుండవు. రోజు విడిచి రోజు గంట నుంచి గంటన్నర పాటు సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని ప్రాంతాలకు 40 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. ఈ కృత్రిమ కొరతను జల మండలిలోని క్షేత్రస్థాయి ఉద్యోగులే సృష్టిస్తున్నారని విజిలెన్స్‌ గుర్తించినట్లు సమాచారం. వంద మిలియన్‌ లీటర్లు అధికంగా సరఫరా చేసినా నీళ్లొస్తలేవనే ఫిర్యాదులపై ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు. వేసవిలో మెరుగ్గా పనిచేసి దాహార్తి తీర్చాల్సిన కొందరు అధికారులు, ఉద్యోగులు అందుకు భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారని విజిలెన్స్‌ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా, జల మండలిలో 24 ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ డివిజన్లున్నాయి. వీటిలో నచ్చిన పోస్టింగ్‌ కోసం కొందరు జీఎంలు, డీజీఎంలు ఎమ్మెల్యేలకు పూర్తి విధేయులుగా మారారు. మరోవైపు గత ప్రభుత్వంలో తాగునీటి సరఫరా నిర్వహణ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా తమకు పనికి వచ్చేవారిని కూర్చోబెట్టారు. ఇలా పదేళ్లుగా ఒకేచోట ఉన్నవారు 40 మంది వరకు ఉన్నారు. వీరి బదిలీకి ఉపక్రమించగానే కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలిసింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్నవారిని మార్చాలని జలమండలి ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ సీఎం రేవంత్‌రెడ్డికి రెండు నెలల క్రితం వినతిపత్రం ఇచ్చింది. అయినా ఏ ఒక్కరినీ కదిలించలేదు. ఈ నేపథ్యంలోనే నీటి సరఫరా ఆటంకాలకు కుట్రలు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, పలు ప్రాంతాల్లో పైపులైన్లు లీకవుతూ నీరు వృథాగా పోతున్నా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాటర్‌ బోర్డు ఎండీ సీరియస్‌ అయ్యేవరకు కొందరు జీఎంలు కదల్లేదు. దీన్నిబట్టే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

లైన్‌మైన్లపై అదుపేది?

తాగు నీటి సరఫరాలో క్షేత్రస్థాయిలో లైన్‌మెన్లు కీలకం. వీరిలో చాలామంది గత ప్రభుత్వంలో నియమితులయ్యారని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అనుచరులుగా ఉన్నారని అంటున్నారు. నగరంలో నీటి సరఫరాను పూర్తిగా లైన్‌మెన్లకు వదిలేశారు. పలువురు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నివాసితుల నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నచోట అధికంగా ఇస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 08:11 AM