Share News

Telangana: విధుల్లో నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు..!

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:51 AM

విధుల్లో నిర్లక్ష్యానికి ఇకపై మూల్యం చెల్లించక తప్పదని పోలీసు శాఖ(Police Department) ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో క్రమశిక్షణ చర్యల విషయంలో పెద్దగా చూసీ చూడనట్లు వ్యవహరించినా.. కొంతకాలంగా పోలీసు శాఖకు మచ్చతెచ్చేలా సిబ్బంది ఎలాంటి చిన్న పొరపాటు చేసినా..

Telangana: విధుల్లో నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు..!
Telangana Police

  • మాజీ ఎమ్మెల్యే కుమారుడి రోడ్డు ప్రమాదం కేసులో ఇద్దరి సస్పెన్షన్‌

  • మత్తులో విధులకు వచ్చిన ఇన్‌స్పెక్టర్‌పై వేటు

  • గంజాయి కేసులో నిర్లక్ష్యం.. ఇద్దరు ఎస్సైలపై చర్యలు

  • ఓ హెడ్‌కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యానికి ఇకపై మూల్యం చెల్లించక తప్పదని పోలీసు శాఖ(Police Department) ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో క్రమశిక్షణ చర్యల విషయంలో పెద్దగా చూసీ చూడనట్లు వ్యవహరించినా.. కొంతకాలంగా పోలీసు శాఖకు మచ్చతెచ్చేలా సిబ్బంది ఎలాంటి చిన్న పొరపాటు చేసినా.. సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులను అరెస్టు కూడా చేస్తున్నారు. మల్టీజోన్‌-1 ఐజీ ఏవీ రంగనాథ్‌(AV Ranganath) గురువారం ఒక్కరోజే ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. వీరిలో నిజామాబాద్‌లో(Nizamabad) మద్యం సేవించి విధులకు హాజరైన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ ఠాణాలో నమోదైన గంజాయి కేసులో అలసత్వం వహించిన ఎస్సైలు జి.మనోహర్‌రావు, ఎ.తిరుపతి, హెడ్‌కానిస్టేబుల్‌ రవీందర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ టి.నరేందర్‌, బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ పేమ్‌కుమార్‌ ఉన్నారు. పంజాగుట్ట ఠాణా పరిధిలో.. ప్రజాభవన్‌ వద్ద గత ఏడాది డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోతో బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ సంప్రదింపులు జరిపారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావును అప్పట్లోనే సస్పెండ్‌ చేసి, ఆ తర్వాత అరెస్టు చేశారు. బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఇటీవల అరెస్టు చేశారు. కానీ.. గురువారం దాకా ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయలేదు. పోలీసులపై షకీల్‌ తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఓ వీడియోను విడుదల చేసిన వెంటనే ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం..!


వరుస సస్పెన్షన్లు..

  • కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌, ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత ఏడాది డిసెంబరులో సైబరాబాద్‌ సీపీ వారిని సస్పెండ్‌ చేశారు.

  • ఇటీవల రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై లాలాగూడ మహిళా ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు.

  • 4 రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో ఓ కాంగ్రెస్‌ నేత డ్యాన్స్‌ చేసిన ఘటనపై సీరియస్‌ అయిన ఉన్నతాధికారులు.. మహదేవ్‌పూర్‌ ఠాణా ఎస్‌హెచ్‌వో జి.ప్రసాద్‌ను బదిలీ చేయగా.. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ను సస్పెండ్‌ చేశారు.


కొరడా ఝళిపిస్తున్న ఏసీబీ

  • ఏసీబీ కూడా పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల రూ.30 వేల లంచం తీసుకుంటూ మాదాపూర్‌ ఎస్సై రంజిత్‌ కుమార్‌, కానిస్టేబుల్‌ విక్రం ఏసీబీకి చిక్కారు.

  • 3 రోజుల క్రితం ఆసిఫాబాద్‌ ఎస్సై రాజ్యలక్ష్మి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

  • తాజాగా శుక్రవారం భద్రాచలం టౌన్‌ ఎస్సై శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ శంకర్‌ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 10:51 AM