Share News

TS Politics: రాజరికాన్ని తలపించేలా గత బీఆర్ఎస్ పాలన: మహేష్ కుమార్ గౌడ్

ABN , Publish Date - Feb 19 , 2024 | 04:17 PM

రాజరికాన్ని తలపించేలా గత బీఆర్ఎస్ పాలన సాగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.

TS Politics: రాజరికాన్ని తలపించేలా గత బీఆర్ఎస్ పాలన: మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: రాజరికాన్ని తలపించేలా గత బీఆర్ఎస్ పాలన సాగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. సోమవారం నాడు ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ 70 రోజుల పాలనపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ నియంతలా ప్రగతి భవన్ నుంచి పాలన సాగించారని.. నేడు అదే ప్రజా భవన్‌గా మారిందని తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని అన్నారు . 70 రోజుల్లో మూడు శ్వేతపత్రాలు ఇచ్చామని అన్నారు. రూ. లక్ష 25 వేల కోట్లను గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంపై వెచ్చించిందని తెలిపారు. ప్రజా సొమ్మును వారు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లు ఆగమయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. తాబేదార్లుగా ఉన్న వారికే కాంట్రాక్టులు ఇచ్చారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని గులాబీ నేతలు మోసం చేశారని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్తారు..

2 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని స్పష్టం చేశారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మరోసారి గులాబీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారని విమర్శించారు. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు పసలేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శ్వేతపత్రాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు. ప్రజలు కోరుకునే విధంగా అవినీతిని బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా బయట ఉండరని.. జైలుకు పోతారని హెచ్చరించారు. అధికారులు కూడా కేసీఆర్ కుటుంబం చెప్పినట్లుగా పనులు చేశారని అన్నారు. వాళ్లు కూడా లోపలికి పోవాల్సిందేనని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై చర్చ జరుగుతుందని.. ఈ పర్యటనపై తనకు ఇంకా సమాచారం ఇవ్వలేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 04:27 PM