Share News

BRS.. కొత్త పలుకులో ఇది రాధాకృష్ణ చెప్పారు: కేటీఆర్

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:57 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఈ మేరకు ఆహ్వానం పంపింది.

BRS.. కొత్త పలుకులో ఇది రాధాకృష్ణ చెప్పారు: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఈ మేరకు ఆహ్వానం పంపింది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓటర్ల పరంగా మల్కాజిగిరి దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఈ సమావేశంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.

కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్నాయని, ఈ రోజు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు చూస్తే అదే విషయం రుజువు అవుతోందని కేటీఆర్ అన్నారు. ఇటీవల ప్రధాని మోదీని, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసినపుడు బీఆర్ఎస్‌ను ఫినిష్ చేయాలని కోరారని, కొత్త పలుకులో ఇది వేమూరి రాధాకృష్ణ చెప్పారన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా? అని వ్యాఖ్యానించారు. అదానీ, మోదీ ఒక్కటేనని ఢిల్లీలో విమర్శించే కాంగ్రెస్.. దావోస్‌లో అదే ఆదానీతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు.

అదానీకి మనం అవకాశమే ఇవ్వలేదు..

అదానీకి మనం (బీఆర్ఎస్) అవకాశమే ఇవ్వలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఇంకో ఏడో.. ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదని, తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. పోయిన సారి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామని, అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రెవంత్ రెడ్డి పిలుపునిచ్చారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాటలను గుర్తు చేస్తున్నానన్నారు.

ఇది కూడా చదవండి.. మోదీ ‘మూడు’తో మూడేదెవరికి?

కరెంట్ బిల్లులు కట్టవద్దంటే తనది విద్వంసకర మనస్తత్వమని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా? అని ప్రశ్నించారు. సోనియానే బిల్లులు కడుతుందని వాళ్ళు చెప్పారని.. కరెంటు బిల్లులు సోనియాకే పంపుదామని అన్నారు. నరేంద్రమోదీకి, రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆర్‌ఎస్ కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - Jan 21 , 2024 | 01:57 PM