Share News

Kodandaram: కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ది తప్పుడు నిర్ణయం: కోదండరాం

ABN , Publish Date - Mar 10 , 2024 | 01:56 PM

హైదరాబాద్: కాళేశ్వరంపై బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని, కాగ్ చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

Kodandaram: కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ది తప్పుడు నిర్ణయం: కోదండరాం

హైదరాబాద్: కాళేశ్వరం (Kaleswaram)పై బీఆర్ఎస్ (BRS) అబద్దాలు చెబుతోందని, కాగ్ (Cog) చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం కోదండరాం సోమాజిగూడ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితికి పని చేసిన హన్మంతరావు సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టవద్దన్నప్పటికి కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. కాగ్ నివేదికలో ఉన్న అంశాలు మనమే స్వంతంగా రాసినట్టుందని.. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు ఆర్ధిక అంశాల గురించి అంచనా వేయకుండా నిర్మించారని ఆరోపించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను కొందరికి గుండు గుత్తగా కేటాయించారని కాగ్ వెల్లడించిందన్నారు.

కాళేశ్వరం ద్వారా రైతులకు సాగు నీరు అందించడం చాలా కష్టమని, ఒక ఎకరాకు నీరందించడానికి 46 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కోదండరాం అన్నారు. రాష్ట్రంలో 60 శాతం విద్యుత్ కాళేశ్వరం నిర్వహణకు అవసరం ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో భూకంపలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కేవలం కొండ పోచ్చమ్మ కాలువ నిర్మాణానికి రూ. 70 కోట్లు కేటాయించారని, గతంలో కడెం ప్రాజెక్ట్ మట్టి మాత్రమే కొట్టుకుపోయిందని.. తర్వాత జరిగిన నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు కుంగాయి.. ఇంటికి ఒక్క పిల్లర్ కుంగితే ఇల్లు నిలబడుతుందా..? అని కోదండరాం ప్రశ్నించారు. కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి 80 శాతం నీళ్లు అందించే బ్యారేజ్ అదే పగుళ్ళు చూపిందన్నారు. కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే కాదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్షకు రూ. 87 వేలకోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్ధికంగా కుప్పకూల్చారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇంజనిరింగ్ వ్యవస్థ నిర్వర్యం జరిగిందని.. దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గేందుకు రీషెడ్యూల్ చెయ్యాలని కోరుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ఈ విధంగా మారడానికి కారణమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కోట్ల రూపాయల దోపిడి జరిగిందని కోదండరాం తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - Mar 10 , 2024 | 01:57 PM