Share News

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

ABN , Publish Date - Apr 10 , 2024 | 11:22 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!
Telangana Politics

హైదరాబాద్, ఏప్రిల్‌ 10: గ్రేటర్‌ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి సెగ్మెంట్‌ను చుట్టేశారు. ఎన్నికలకు సమయం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ సార్లు ఓటర్లను కలుసుకోవడం, పర్యటనలు, సమావేశాలు, మార్నింగ్‌, ఈవినింగ్‌ వాక్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సికింద్రాబాద్‌లో అభివృద్ధిని వివరిస్తూ..

సికింద్రాబాద్‌లో(Secunderabad) సిట్టింగ్‌ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేస్తుండడంతో ఇక్కడ ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. కిషన్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు సికింద్రాబాద్‌ సెగ్మెంట్‌లోని అని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఓటర్లను కలుసుకుని మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. రెండోసారి పోటీ చేస్తుండడంతో ఆయనకు ఈ నియోజకవర్గంపై పట్టు ఉంది. దీనికి తోడు తన అసెంబ్లీ నియోజకవర్గమైన అంబర్‌పేట కూడా సికింద్రాబాద్‌ పార్లమెంట్‌లో కలుస్తుండడంతో ఆయనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుంటున్నారు.

మల్కాజిగిరిలో ఈటల జోరు..

మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో టికెట్‌ కేటాయించినప్పటీ నుంచి అభ్యర్థి ఈటల రాజేందర్‌ విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లు, స్థానిక సంఘాలు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పూట ఎక్కువగా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. మరోవైపు ప్రచారం నిర్వహిస్తూనే ఇఫ్తార్‌ విందుల్లో సైతం పాల్గొంటూ ఓటర్లను ఆకర్శిస్తున్నారు. ఈసారి ఎంపీగా గెలువాలనే లక్ష్యంతో ఈటల రాజేందర్‌ ఆయన కార్యక్రమాలను రూపొందించుకుని ముంందుకు సాగుతున్నారు.

హైదరాబాద్‌లో హల్‌చల్‌..

మొదటి జాబితాలోనే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన మాధవీ లత హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో తన ప్రచార జోరును పెంచారు. అప్పటికే ఆమె గత కొంతకాలంగా లతా మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాతబస్తీలో పలు సేవా, ఆరోగ్య, ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గంలో పట్టు సాధించింది. ఈ నేపథ్యంలో ఆమెను బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసి ప్రకటించారు. ఇక అప్పటినుంచి చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్‌, గోషామహల్‌ కార్వాన్‌, మలక్‌పేట నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులను ఆమె కలిసి మద్దతు కూడగట్టుకుంటున్నారు. మజ్లిస్‌ హయాంలో అభివృద్ధి లేదని, పేద ముస్లింలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆమె ప్రచారం చేస్తూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాతబస్తీలో జరిగే ఇఫ్తార్‌ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. గతంలో కంటే ఈ సారి హైదరాబాద్‌లో బీజేపీ, మజ్లిస్‌ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 11:22 AM