Harish Rao: కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్..
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:25 PM
తెలంగాణ: గురుకుల పాఠశాల హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అక్కడ పెడుతున్న అన్నం తినలేక విద్యార్థులు ఇళ్లకు పరుగులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని హరీశ్ రావు ఆగ్రహించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TG Govt) విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) పాలనలో చదువు సంగతి దేవుడెరుగు పిల్లలు ప్రాణాలతో ఉంటే చాలని తల్లిదండ్రులు భావిస్తున్నారని మాజీ మంత్రి చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయని, అందులో పెడుతున్న అన్నం తినలేక విద్యార్థులు ఇళ్లకు పరుగులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని హరీశ్ రావు ఆగ్రహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
హరీశ్ రావు ట్వీట్..
"కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు పిల్లలు బ్రతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ ఉండలేమంటూ గురుకులాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే, బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో ఈ అన్నం తినలేం, మమ్మల్ని తీసుకెళ్లండంటూ తల్లిదండ్రులను విద్యార్థులు వేడుకుంటున్నారు. మరోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో పది మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి. కల్తీ ఆహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు.
ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారు. ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా?. కన్న బిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాల నుంచి బిడ్డలను తీసికెళ్లిపోతున్నారు. ఏడాదిలో మీ పాలనా వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి, విద్యార్థుల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.