Share News

TS News: ఆ స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ .. సంచలన విషయాలు వెలుగులోకి.. ఆ నేతల్లో టెన్షన్

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:22 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గొర్రెల పంపిణీ పథకం చేపట్టింది. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని గొర్రెల కొనుగోలుదారులు ఏసీబీకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

TS News: ఆ స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ .. సంచలన విషయాలు వెలుగులోకి.. ఆ నేతల్లో టెన్షన్

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గొర్రెల పంపిణీ పథకం చేపట్టింది. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని గొర్రెల కొనుగోలుదారులు ఏసీబీకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రెల పంపిణీ అక్రమాల్లో ఏసీబీ నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అరెస్టైన వారిలో డి. రవి, ఎం ఆదిత్య కేశవ సాయి, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, జిల్లా భూగర్భ జల అధికారి శ్రీ పసుల రఘుపతి రెడ్డి, వయోజన విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ సంగు గణేష్ ఉన్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను కస్టడీలోకి తీసుకున్నారు. గత మూడు రోజులుగా ఏసీబీ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. అలాగే ఈ స్కాంకు సంబంధించి కాంట్రాక్టర్లపై కూడా దృష్టిపెట్టారు.

నిందితుల బ్యాంకు అకౌంట్లపై విచారణ

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో మూడు గంటలుగా విచారణ కొనసాగుతున్నది. 18 మంది రైతుల స్టేట్‌మెంట్లు, బ్యాంక్ ట్రాన్సక్షన్లను ముందు పెట్టి ఏసీబీ విచారిస్తుంది. ఈ స్కాంలో పది అకౌంట్లలో రూ. 2.10 కోట్ల అక్రమాలకు నిందితులు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా దళారుల ఖాతాలో నిందితులు డబ్బులు జమ చేసినట్లు నిర్ధారించారు. బ్యాంక్ హోల్డర్స్ హిమజ మల్ల, నవాజ్ అకౌంట్లకు నగదు బదిలీలు ఎందుకు జరిగాయనే విషయంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రైవేట్ ఏజెంట్లు, రాజకీయ నాయకుల ప్రమేయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. గొర్రెల స్కామ్‌తో పాటు ఆవుల పథకం నిధులు గోల్‌మాల్‌పై కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఈ స్కాంలో డొంక కదులుతుండటంతో కొంతమంది బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. అయితే నిందితులు ఇంకా ఎవరిని మోసం చేశారు.. ఎంతమంది నుంచి నగదును సేకరించారు. నిందితుల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు. వారికి ఇంకా ఏయే బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, నిందితుల ఫోన్‌ లిస్టుల్లో ఉన్న కొంతమందిపై కూడా ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 29 , 2024 | 04:23 PM