Electric Shock: అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
ABN , Publish Date - Aug 19 , 2024 | 04:44 AM
వ్యవసాయంలో నష్టాలు రావడంతో సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు, కరెంటు షాక్‌తో ఇద్దరు అన్నదాతలు చనిపోయారు.
కరెంట్ షాక్‌తో ఇద్దరు అన్నదాతల మృతి
వేలేరు/దస్తురాబాద్/ధారూరు/మేడారం, ఆగస్టు 18 : వ్యవసాయంలో నష్టాలు రావడంతో సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు, కరెంటు షాక్‌తో ఇద్దరు అన్నదాతలు చనిపోయారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బండ కృష్ణ(45) పదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రెండు పంటలు ధ్వంసమై నష్టపోవడం.. ఇటీవల చిన్న కుమారుడు అనారోగ్యం బారిన పడటంతో రూ.8 లక్షల వరకు అప్పు అయ్యింది.
దీంతో మనస్తాపం చెందిన కృష్ణ.. ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లికి చెందిన దామెర అనిల్ కుమార్(31) గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. మూడేళ్లుగా దిగుబడి రాకపోవడంతో సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీనికి తోడు చెల్లెలి పెళ్లి, కుటుంబ అవసరాల కోసం మరో రూ.3.50 లక్షల వరకు అప్పులయ్యాయి.
దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనోవేదనతో అనిల్ శనివారం అర్ధరాత్రి ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. నిర్మల్ జిల్లా ఎర్రగుంట గ్రామానికి చెందిన అజ్మీరా రాజేష్(31) పొలంలో పెరిగిన గడ్డిని ఆదివారం కోస్తున్నాడు. ఈ క్రమంలో అప్పటికే పొలంలో తెగిపడిన విద్యుత్ వైరు కాలికి తగలడంతో షాక్‌తో మృతి చెందాడు.
వికారాబాద్ జిల్లా ధారూరు మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన గుర్రం రవీందర్(27) ఓ ఫాంహౌ్‌సలో పని చేస్తున్నాడు. దాని వెనకనే రవీందర్‌కు ఓ గేదెల షెడ్డు ఉంది. శనివారం రాత్రి ఫాంహౌ్‌సకు చేరుకున్న రవీందర్.. ఆ వెనకనే ఉన్న తన గేదెలను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడున్న కరెంటు స్తంభానికి తాకి విద్యుదాఘాతంతో చనిపోయాడు.