Share News

TG: చిహ్నం మార్పుతో చికాకులే!

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:11 AM

మాజీ సీఎం కేసీఆర్‌తో పోల్చితే ప్రస్తుత సీఎం రేవంత్‌ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని అవాంఛనీయమైన అంశాలు తాజాగా తెరమీదకు రావడం ఆశ్చర్యంగా ఉంది.

TG: చిహ్నం మార్పుతో చికాకులే!

పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇవాళ్టి నుంచి తెలంగాణ సొంతం. ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ను సొంతం చేసుకోగా.. ఏపీ ప్రకటించుకున్న రాజధానిని కూడా కాదనుకొని రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది.


మాజీ సీఎం కేసీఆర్‌తో పోల్చితే ప్రస్తుత సీఎం రేవంత్‌ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని అవాంఛనీయమైన అంశాలు తాజాగా తెరమీదకు రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో రాష్ట్రగీతంలో మార్పులు చేయాలనుకోవడం మొదటిది. అందెశ్రీ రచించిన గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వర కల్పన చేయడాన్ని బీఆర్‌ఎస్‌ తప్పుబడుతోంది. ఇందులో హేతుబద్ధత లేదు. కళలకు కులం, మతం, ప్రాంతం అంటూ ఎల్లలు ఉండవు. సంగీతానికి అసలు ఏ హద్దులూ ఉండవు. అయినా రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేయడానికి తెలంగాణకు చెందిన సంగీత దర్శకులే లభించలేదా? కీరవాణి అవసరం ఏమిటి? అని ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ లాంటి నాయకులు నిలదీయడం ఎబ్బెట్టుగా ఉంది. నిజానికి కీరవాణి ఆంధ్రవాడు అని కూడా చెప్పలేం. హైదరాబాద్‌లో స్థిరపడటానికి ముందు ఆయన చెన్నైలో ఉండేవారు.


రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేయాలనుకుంటున్నప్పటికీ ఫలితం ఉంటుందా? తెలంగాణవాదం ఇప్పుడు కేసీఆర్‌ గడీలో బందీగా లేదు. ఉమ్మడి రాష్ట్ర స్మృతులు మెదళ్ల నుంచి నిష్క్రమించాయి. అయినా కీరవాణిని అడ్డుబెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్‌ అండ్‌ కో వృఽథా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఏ ప్రాతిపదికన నియమించారో వారు చెప్పగలరా? సెంటిమెంట్‌ను రగిలించాలనుకుని అవతలి వారివైపు వేలెత్తిచూపే ప్రయత్నం చేస్తే కేసీఆర్‌వైపు 4వేళ్లు కనిపిస్తాయి.


ఇప్పుడు తెలంగాణలో నివసిస్తున్న వాళ్లందరూ తెలంగాణ వాళ్లే! ఎవరో వేలెత్తిచూపినంత మాత్రాన తెలంగాణ సెంటిమెంట్‌ పండదు. దొరల దురహంకారం తగదనే ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు ఓడించారు. తలెత్తుకొని గర్వించే తెలంగాణ కావాలన్నదే ప్రజల వాంఛ. రేవంత్‌ ప్రభుత్వం మరో అవాంఛనీయమైన అంశాన్ని చేపట్టింది. ప్రభుత్వ చిహ్నంలో మార్పులు చేయాలని రేవంత్‌ ఎందుకు భావిస్తున్నారో తెలియదు. కొద్దిమంది మినహా ప్రజలెవరూ ఈ మార్పు కోరుకోవడం లేదు.


అఽధికార చిహ్నం వంటివి మార్చాలనుకోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగకపోగా ప్రభుత్వాలకు చికాకులు ఎదురవుతాయి. ఇప్పుడు రేవంత్‌ ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తే భవిష్యత్‌లో వచ్చే ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేయవచ్చు. ఈ ధోరణివల్ల తెలంగాణ చిహ్నం ఎలా ఉంటుందో కూడా ప్రజలు గుర్తుపెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. చిహ్నాన్ని మార్చినంత మాత్రాన తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్‌ పేరును తుడిచివేయలేరు.


చిహ్నాలు మార్చడం వంటి చర్యల వల్ల గత ఎన్నికల్లో చతికిలబడిన బీఆర్‌ఎస్‌కు జవసత్వాలు కల్పించినవారు అవుతారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కోసం కేసీఆర్‌ సహజంగానే ఎదురుచూస్తారు. అధికారిక చిహ్నంలోని చార్మినార్‌ను కూడా మార్చాలనుకోవడం ఎందుకో తెలియదు. నిన్న మొన్నటివరకు హైదరాబాద్‌ చిహ్నంగా చార్మినార్‌నే చెప్పుకొన్నాం. రాష్ర్టానికి వచ్చిన అతిథులకు చార్మినార్‌ రూపంలో ఉన్న జ్ఞాపికలను ఇచ్చేవాళ్లం. ఈ నేపథ్యంలో అనవసర, అవాంఛనీయ అంశాలను కెలుక్కుని తనపై ప్రత్యర్థి రాజకీయ దాడి చేసేందుకు అస్త్రాలు సమకూర్చడమా? లేదా? అన్నది రేవంత్‌ తేల్చుకోవాలి. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై స్వల్ప అసంతృప్తి నెలకొంటోంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆ విషయం గ్రహించి ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా మొగ్గలోనే అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రజాభిమానం ప్రజాగ్రహంగా మారడానికి ఎంతో సమయం పట్టదు.

Updated Date - Jun 02 , 2024 | 07:14 AM