Share News

CM Revanth Reddy: 2రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి..

ABN , Publish Date - May 23 , 2024 | 04:41 AM

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే ప్రభుత్వం, ముఖ్యమంత్రితో తెలంగాణ సీఎంగా సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలన్నిటినీ పరిష్కరించుకుని ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: 2రాష్ట్రాల మధ్య  సత్సంబంధాలు కొనసాగాలి..

  • సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై అక్కడి కొత్త ప్రభుత్వంతో కలిసి ముందుకు..

  • తిరుమలలో భక్తుల కోసం సత్రం, కల్యాణ మండపం నిర్మిస్తాం: రేవంత్‌

  • శ్రీవారి సన్నిధిలో మనుమడికి పుట్టెంట్రుకలు.. కుటుంబ సమేతంగా దర్శనం

  • ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రితో కలిసి ముందుకు సాగుతాం

  • తిరుమలలో భక్తుల కోసం సత్రం, కల్యాణ మండపం నిర్మిస్తాం: రేవంత్‌

  • కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం

  • మనవడి పుట్టెంట్రుకల మొక్కు చెల్లింపు

తిరుమల, మే 22 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే ప్రభుత్వం, ముఖ్యమంత్రితో తెలంగాణ సీఎంగా సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలన్నిటినీ పరిష్కరించుకుని ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం రేవంత్‌.. ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక స్వామి దర్శనం చేసుకోవాలని ప్రయత్నించినా.. సమయం దొరకలేదని, ఇన్నాళ్లకు స్వామి దర్శన భాగ్యం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.


తమ ప్రభుత్వం తరఫున తిరుమలలో ఓ సత్రం, కల్యాణ మండపం నిర్మించి భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక సీఎంను కలిసి తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామి సేవలో భాగస్వాములవుతామని చెప్పారు. వాతావరణం అనుకూలిస్తోందని, గత ఏడాది కరువు వచ్చి తాగునీటి సమస్య ఉన్నప్పటికీ సమస్యలను అధిగమించేలా మంచి రుతుపవనాలు వస్తున్నాయని వెల్లడించారు. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి కూడా అలానే సహకరిస్తోందన్నారు. ఆయా ప్రాంతాల్లోని రైతులకు సహాయం చేసేలా పాలకుల మనసు మార్చాలని స్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకుని.. దేశ సంపదను పెంచాలని తమ ప్రభుత్వం కూడా యోచిస్తోందన్నారు.


మనవడి పుట్టెంట్రుకల మొక్కు కోసం..

మంగళవారం రాత్రే కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్‌.. బుధవారం ఉదయం మనవడి పుట్టెంట్రుకల మొక్కుని చెల్లించారు. అనంతరం సతీమణి, కుమార్తె, అల్లుడు కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆయన ఆలయంలోకి వెళ్లారు. ధ్వజస్తంభాన్ని తాకుతూ గర్భాలయానికి చేరుకున్నారు. అక్కడ మూలమూర్తిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు రేవంత్‌ కుటుంబానికి ఆశీర్వచనం చేశారు. ఈవో ధర్మారెడ్డి వారికి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన రేవంత్‌ మనవడిని భుజంపైకి ఎత్తుకుని సంబరపడ్డారు. ఆలయం ముందున్న అభిమానులను పలకరిస్తూ తిరిగి అతిథి గృహానికి చేరుకున్నారు. కొంత సమయం విశ్రాంతి తర్వాత తిరుమల నుంచి తిరుగుపయనమయ్యారు.


  • తీన్మార్‌ మల్లన్న భారీ మెజారిటీతో గెలవాలి

  • మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, తీన్మార్‌ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం సీఎం మూడు ఉమ్మడి జిల్లాల నాయకులతో జూమ్‌ ద్వారా సమావేశమయ్యారు. మూడు ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జులు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ బూత్‌లను సందర్శించాలని సూచించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్‌ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, ఆయన గెలుపు.. సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందన్నారు. 27న పోలింగ్‌ నేపథ్యంలో క్షేత్ర స్థాయి కార్యకర్తలను సన్నద్ధం చేయాలన్నారు.

Updated Date - May 23 , 2024 | 04:41 AM