Share News

Telangana: గల్లీ మే లూటో.. ఢిల్లీ కో భేజో..!

ABN , Publish Date - May 27 , 2024 | 03:08 AM

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే స్కామ్‌లు అనే మాటను రాష్ట్రంలో నిజం చేసి చూపారని, పౌర సరఫరాల శాఖలో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఆరోపించారు.

Telangana: గల్లీ మే లూటో.. ఢిల్లీ కో భేజో..!

  • రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడిన కాంగ్రెస్‌

  • ధాన్యం సేకరణ, సన్నబియ్యం సరఫరాలో అవినీతి

  • నాలుగు ప్రైవేటు సంస్థలతో మిల్లర్లకు బెదిరింపులు

  • సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి : కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ అంటేనే స్కామ్‌లు అనే మాటను రాష్ట్రంలో నిజం చేసి చూపారని, పౌర సరఫరాల శాఖలో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఆరోపించారు.

ప్రైవేటు సంస్థలతో రాష్ట్రంలోని మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడి మనీ లాండరింగ్‌ చేశారని, ఆ మొత్తాన్ని సీఎం పేషీ, ఢిల్లీ పెద్దలకు పంపారన్నారు. ఇది చూస్తుంటే ‘గల్లీమే లూటో.. ఢిల్లీకో భేజో’ అన్నట్లు కాంగ్రెస్‌ నేతల తీరు ఉందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఈ ఏడాది జనవరి 25న కమిటీ ఏర్పాటు చేసి, అదే రోజు విధి విధానాలు ఖరారు చేసి టెండర్లు పిలిచారన్నారు. అప్పటికే మిల్లర్లు క్వింటాలు ధాన్యానికి రూ.2,100 ఇచ్చేందుకు ముందుకొచ్చినా వారిని కాదన్నారన్నారు.

దాని కంటే తక్కువగా రూ.1,850 నుంచి రూ.2,030 మధ్య రేటు నిర్ణయించి తమకు అనుకూలైమన నాలుగు కంపెనీలకు టెండర్లు వచ్చేలా చూశారన్నారు. కేంద్రీయ భండార్‌, ఎల్‌జీ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ కంపెనీ, నాకాఫ్‌ అనే సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయన్నారు. కేంద్రీయ బండార్‌ సంస్థను తమ ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెడితే దానికి నిబంధనల్లో మినహాయింపు ఇచ్చారన్నారు.

ఇలా 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి నాలుగు కంపెనీలు రూ.750 కోట్లు మిల్లర్ల నుంచి అదనంగా వసూలు చేశాయన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరాలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్కామ్‌కు పాల్పడుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. ఆ నాలుగు సంస్థలకే ఈ టెండర్లు కూడా కట్టబెట్టారన్నారు.


బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం ధర రూ.42 ఉండగా పౌర సరఫరాల శాఖ ఆ నాలుగు కంపెనీలతో రూ.57, రూ.56.90కి కొనుగోలుకు ఒప్పందం చేసుకుందన్నారు. ప్రతి కిలోపై మార్కెట్‌ రేటుకన్నా రూ.15 పెంచి రూ.300 కోట్లకు పైగా కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెద్దలు కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కై మొత్తం రూ.1,050 కోట్ల కుంభకోణం చేశారని, ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై బీజేపీఎల్‌పీ నేత మహేశ్వర్‌రెడ్డి కూడా ఆరోపిస్తున్నా కేంద్రంలోని బీజేపీ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్రపై కూడా అనుమానంగా ఉందన్నారు. ఎఫ్‌సీఐ వెంటనే ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేయాలన్నారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ఉత్తమ్‌ స్వాతిముత్యం అయితే.. సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 27 , 2024 | 03:10 AM