CM Revanth Reddy: మీటర్లపై మోసం!
ABN , Publish Date - Jul 28 , 2024 | 02:56 AM
‘‘వ్యవసాయానికి విద్యుత్తును సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెడతామంటూ కేంద్రంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దానిపై అప్పట్లో అధికారులు సంతకాలు చేశారు.

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడతామన్నారు
త్రైపాక్షిక ఒప్పందంలో కేంద్రం, రాష్ట్రం, డిస్కంలు
మోదీ సమక్షంలో 2017 జనవరి 4న సంతకాలు
ఒప్పందం విషయాన్ని దాచి గొప్పలు చెబుతున్నారు
దీంతో వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టే పరిస్థితి
లేకపోతే డిస్కమ్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది
ఉదయ్ ఒప్పందాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి
బీఆర్‌ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలి
గొర్రెలు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలపైనా విచారణకు
సిద్ధమా?.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘‘వ్యవసాయానికి విద్యుత్తును సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెడతామంటూ కేంద్రంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దానిపై అప్పట్లో అధికారులు సంతకాలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలివిగో’’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సంబంధిత ఫైళ్లను అసెంబ్లీలోనే ఉన్న హరీశ్ రావుకు పంపించారు. మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం అదనంగా ఇప్పిస్తానన్న రూ.30 వేల కోట్ల అప్పును తాము తిరస్కరించామంటూ బీఆర్‌ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకొంటున్నారని, కానీ.. ఒప్పందం చేసుకున్న విషయాన్ని దాచి పెడుతున్నారని ఆరోపించారు. బడ్జెట్‌పై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు పెడితే అదనంగా రూ.30 వేల కోట్ల అప్పునకు అనుమతి ఇస్తామని కేంద్రం చెప్పిందని, అయినా.. దానిని తాము తిరస్కరించామని పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా మాత్రమే కాకుండా వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సభలో బుకాయించడం సమంజసం కాదని తప్పుబట్టారు. త్రైపాక్షిక ఒప్పందం వివరాలను సభలో బయటపెట్టారు. ‘‘సభను, సభ్యులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని హరీశ్‌రావు చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల విషయంలో వాళ్లేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నారు. ఇది అబద్ధం. ఆరు నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు బిగిస్తామంటూ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర డిస్కంలు 2017 జనవరి 4న త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్)లో భాగస్వాములయ్యాయి. మొత్తం 28 పేజీల అగ్రిమెంట్‌లో ఏడో పేజీలో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ ఒప్పందంపై అప్పటి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, సదరన్ డిస్కం తరపున రఘుమా రెడ్డి, నార్త్ డిస్కం తరపున ఎ.గోపాలరావు, కేంద్ర విద్యుత్తు శాఖ తరపున సంయుక్త కార్యదర్శి డాక్టర్ అరుణ్‌కుమార్ వర్మ సంతకాలు పెట్టారు.
2017 జూన్ 30లోపు అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు; 2018 డిసెంబరు 31లోపు 500 యూనిట్లకుపైగా విద్యుత్తును వినియోగించే వినియోగదారుల ఫీడర్ల వద్ద, 2019 డిసెంబరు 31లోపు 200 యూనిట్లకుపైగా వినియోగించుకునే వారి ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఒప్పందంలో రాశారు. అంటే.. గృహ, వ్యవసాయ వినియోగదారులు వినియోగించే విద్యుత్తుకు నూటికి నూరు శాతం మీటర్లు బిగిస్తామని సుస్పష్టంగా ప్రధాని మోదీ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు’’ అని వెల్లడించారు. ఉదయ్ ఒప్పందం, అందులోని కీలక అంశాలను ప్రస్తావించారు. 2017 జూన్ 30వ తేదీకల్లా అన్ని ఫీడర్లకు మీటర్లు పెట్టాలని, 2018 మార్చి 31వ తేదీలోపు గ్రామీణ ప్రాంతాల్లో 11 కేవీ స్థాయి దాకా విద్యుత్ లెక్కలు తీయాలని అందులో ఉందని తెలిపారు. త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసింది వాస్తవమా...? కాదా...? అని నిలదీశారు. సభకు వెంటనే హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కూడా సభలో చెప్పలేదని తప్పుబట్టారు. ‘‘ఈ ఒప్పందం అమలు చేయకపోతే, స్మార్ట్ మీటర్లు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం డిస్కమ్‌లపై చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.
ప్రస్తుతం డిస్కమ్‌ల మెడపై కత్తి వేలాడుతోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ఆ ఒప్పందాలు తెలంగాణకు గుదిబండగా మారాయి. వాళ్లు, వీళ్లు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నారు. అప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కనిపించలేదు. ఎన్నికలు దగ్గరికి వచ్చినప్పుడు రైతులు ఉరి వేస్తారని వాస్తవాలు దాచిపెట్టారు’’ అని ఆక్షేపించారు. ఉదయ్ ఒప్పందాన్ని డిస్కమ్‌లు అమలు చేయక తప్పని పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన అనివార్య పరిస్థితి వచ్చిందని, దీనికి బీఆర్‌ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని, రేపు పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లు కూడా కాలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజానికి ఈరోజు స్పష్టమైన వివరాలు ఇస్తున్నానని, మోదీతో ఆనాటి సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నది వాస్తవమని స్పష్టం చేశారు. అయినా.. హరీశ్ సభలో అబద్ధాలు చెబుతున్నారని, రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. సదరు ఒప్పందం కాపీలను హరీశ్‌కు ఇస్తామని చెబుతూ వాటిని పంపించారు. తలకిందులుగా తపసు చేసినా రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
అమ్ముకున్న లెక్కలూ చెప్పాలి
‘‘అప్పుల లెక్కలే కాదు.. అమ్ముకున్న లెక్కలు కూడా చెప్పాలి. మేం ఇది కట్టినం.. అది కట్టినమని కట్టడాల లెక్కలే కాదు. అమ్ముకున్న లెక్కలూ చెప్పాలి’’ అంటూ బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్‌లు, గొర్రెల పథకాలపై విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. 159 కిలో మీటర్ల ఔటర్ రింగు రోడ్డును ఆనాటి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా, ఆదర్శంగా కడితే.. లక్షల కోట్ల ఔటర్ రింగు రోడ్డును పల్లీబఠానీలకు అమ్ముకున్నట్లు రూ.7 వేల కోట్లకు తెగనమ్మారని మండిపడ్డారు. ‘‘గొర్రెల పథకంలో రూ.700 కోట్లు దిగమింగారని రిపోర్టులు వచ్చినయ్. కేసీఆర్ కిట్‌లో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకు పోదాం.
వాళ్లు గొప్ప పథకంగా చెప్పుకునే బతుకమ్మ చీరల అవినీతి మీదా విచారణకు సిద్ధం’’ అని రేవంత్ సవాల్ చేశారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నామని చెప్పారని, సూరత్ వెళ్లి కిలోల లెక్కన చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. అందుకే ఆ ఆడబిడ్డలే బయటికి వచ్చి వాటిని తగలబెట్టారని గుర్తు చేశారు. ఆ చీరలను వ్యవసాయ పొలాల్లో పిట్టలను బెదిరించడానికి కడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.80 వేల కోట్లే ఖర్చు చేశామని, మరి లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారని, ఆయన లీడర్ కాదు.. రీడర్ అని విమర్శించారని, ఇప్పుడు రూ.94 వేల కోట్లు ఖర్చు చేశామని వాళ్లే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘నిన్నటికి నిన్న పోయి చూసిన్రు. ఎట్లా కూలిందో ఏమైనా మిగిలిందా లేదా అని చూడటానికి వెళ్లారు’’ అని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ జరగనంత అన్యాయం
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు ఏ అన్యాయం జరిగిందో.. ఏ నిర్లక్ష్యానికి గురైందో బీఆర్‌ఎస్ పాలనలో అంతకంటే దారుణంగా తయారైందని సీఎం మండిపడ్డారు. ‘‘పాలమూరు ప్రజలు ఏం అన్యాయం చేసిన్రు. కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసినం. కరీంనగర్ జిల్లాలో ఓడిస్తారని 2009లో పాలమూరుకు వలస వస్తే.. గుండెల్లో పెట్టుకొని.. భుజాన మోసి పార్లమెంట్‌కు పంపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదట పాలమూరు జిల్లాకే మోసం చేశారు’’ అని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, అవి పూర్తి కాకపోవడానికి వీరి దుర్మార్గమే కారణమని విమర్శించారు. ‘‘మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సమాజం కాళ్లూ చేతులూ విరిచేసింది. అయినా, మారకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఉరి తీసి.. గుండు సున్నా ఇచ్చింది. అయినా, ఆలోచన మారలేదు. బుద్ధి మారకుండా ఇట్లా మాట్ల్లాడుడు కరెక్ట్ కాదు. విద్యుత్తు విషయంలో కేంద్రంతో పోరాడామని అబద్ధాలు చెప్పారు’’ అని విమర్శించారు.