Share News

CM Revanth Reddy: మొత్తం దోచేశారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Feb 02 , 2024 | 06:10 PM

CM Revanth Reddy: ఇంద్రవెల్లి సభా వేదికగా ప్రసంగించిన సీఎం రేవంత్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అందిన కాడికి దోచుకుని.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి డబ్బులు లేకుండా చేశారని ఆరోపించారు. రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా కేసీఆర్ కుటుంబం మిగిల్చిందన్నారు సీఎం రేవంత్.

CM Revanth Reddy: మొత్తం దోచేశారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు..
CM Revanth Reddy Indravelli Meeting

ఆదిలాబాద్, ఫిబ్రవరి 2: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా తొలి సభను ఇంద్రవెల్లి నుంచే రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంద్రవెల్లి సభా వేదికగా ప్రసంగించిన సీఎం రేవంత్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అందిన కాడికి దోచుకుని.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి డబ్బులు లేకుండా చేశారని ఆరోపించారు. రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా కేసీఆర్ కుటుంబం మిగిల్చిందన్నారు సీఎం రేవంత్.

కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది..

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు లేకుండా చేశారని ఆరోపించారు. దోపిడి పాలన కారణంగా, పదేళ్ల దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఏమైనా కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా? అని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ అడవి బిడ్డలను పట్టించుకోలేదని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మాత్రం మొండిచేయి చూపిన కేసీఆర్.. తన బిడ్డ కవితను ప్రజలు ఓడించినా ఎమ్మెల్సీతో ఉద్యోగం ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్.

15 రోజుల్లో 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలు..

రాబోయే 15 రోజుల్లో 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కోర్టు కేసులు పరిష్కరిస్తారం అయ్యేలా పని చేస్తున్నామని చెప్పారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే 7వేల మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలిచ్చామని చెప్పారు సీఎం రేవంత్.

త్వరలోనే రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్..

త్వరలోనే రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌‌ కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం.

ఆనాడే క్షమాపణలు చెప్పాను..

రాంజీగోండ్‌ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటామని ప్రకటించారు సీఎం. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధివైపు నడిపించే బాధ్యత తీసుకుంటామన్నారు. 1981 ఇంద్రవెల్లి దారుణంపై ఆనాడే క్షమాపణ చెప్పానని, ఆనాడు సీమాంధ్ర పాలకుల పాలనలో ఆ తప్పు జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్‌ పాలనను అంతం చేశామని, కేసీఆర్‌ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా? అని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఆ కృతజ్ఞతతోనే కాంగ్రెస్‌ను గెలిపించారు..

ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్ రెడ్డి.. అమరవీరుల ఆశయాలను కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు. చెప్పిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఆ కృతజ్ఞతతోనే తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా చర్యలు తీసుకుంటామని, అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పారు. జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేశారని, ఆ స్ఫూర్తితోనే తాము పని చేస్తామన్నారు. ఇంద్రవెల్లి గాలి, నీటిలో పౌరుషం ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్.

పదేళ్లలో చేయనిది.. 2 నెలల్లో ఎలా సాధ్యం..

కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. ఎవరి చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో ఆలోచన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. కేసీఆర్‌ పదేళ్లలో ఏమీ చేయలేదని, తాము 2 నెలల్లో ఎలా చేస్తాం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కూడా కాలేదని, అప్పుడే విమర్శలు మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్.

Updated Date - Feb 02 , 2024 | 06:15 PM