Share News

Telangana: కుమారుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నాడని భార్యను నమ్మించి..

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:00 AM

కుమారుడిని చూడకుండా ఓ తల్లి ఎన్ని రోజులని ఉండగలదు? ఆ తల్లి ఏకంగా మూడున్నరేళ్లు కొడుకును కనీసం చూడలేదు. భర్తతో గొడవపడి, కుమారుడిని కట్టుకున్నోడి వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అడిగినప్పుడల్లా... ‘కొడుకు బాగున్నాడు’ అని చెబుతూ వచ్చాడా భర్త!! విషయం ఏమిటంటే.. ఓ నాటు వైద్యుడి మందుల కారణంగా ఆ బాలుడు ఈ లోకాన్ని వీడి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఘోరం కన్నతండ్రిగా తనకు తెలిసినా కూడా అతడు భార్యకు చెప్పలేదు. పైగా...

Telangana: కుమారుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నాడని భార్యను నమ్మించి..
Asifabad

  • మూడున్నరేళ్లుగా భార్యను మభ్యపెట్టిన భర్త

  • 11ఏళ్ల బాలుడికి తిమ్మిర్లతో స్వల్ప అనారోగ్య సమస్య

  • నాటువైద్యుడిని సంప్రదించిన బాలుడి తండ్రి

  • అప్పటికే బాలుడి తల్లిపై కన్నేసిన ఆ నాటువైద్యుడు

  • వైద్యం వికటించి ఆశ్రమంలోనే బాలుడి మృతి

  • తండ్రితో కలిసి ఆశ్రమంలో పాతిపెట్టిన నాటు వైద్యుడు

  • ఆసిఫాబాద్‌ జిల్లా పాసిగాం శివారులో ఘోరం

రెబ్బెన, ఏప్రిల్‌ 19: కుమారుడిని చూడకుండా ఓ తల్లి ఎన్ని రోజులని ఉండగలదు? ఆ తల్లి ఏకంగా మూడున్నరేళ్లు కొడుకును కనీసం చూడలేదు. భర్తతో గొడవపడి, కుమారుడిని కట్టుకున్నోడి వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అడిగినప్పుడల్లా... ‘కొడుకు బాగున్నాడు’ అని చెబుతూ వచ్చాడా భర్త!! విషయం ఏమిటంటే.. ఓ నాటు వైద్యుడి మందుల కారణంగా ఆ బాలుడు ఈ లోకాన్ని వీడి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఘోరం కన్నతండ్రిగా తనకు తెలిసినా కూడా అతడు భార్యకు చెప్పలేదు. పైగా... మృతదేహాన్ని మాయం చేద్దామని ఆ నాటు వైద్యుడు చెబితే సహకరించాడు. ఇన్నాళ్లకు భర్త తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కొడుకు ఇక లేడనే విషయం ఆమెకు తెలిసింది. పోలీసుల సమక్షంలో తవ్వగా బయటపడిన కుమారుడి అస్థికలను చూసుకొని ఆమె కంటికీమంటికి ధారగా రోదించింది. ఈ మేరకు ఆసిఫాబాద్‌(Asifabad) జిల్లా రెబ్బెన(Rebbana) మండలం పాసిగాం(Pasigam) గ్రామంలోని ఓ ఆశ్రమం వెనుక ఓ బాలుడి మృతదేహాన్ని గురువారం పోలీసులు వెలికితీశారు.


డీఎస్పీ సదయ్య, మృతుడి తల్లి వివరాల ప్రకారం.. నంబాల గ్రామానికి చెందిన సుల్వ శ్రీనివాస్‌, మల్లేశ్వరికి కుమారులు రిషి (11), అఖిల్‌ ఉన్నారు. నంబాలకే చెందిన భీంరావు అనే నాటు వైద్యుడు ఇదే మండలం పాసిగాం శివారులో ఓ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఆ నాటు వైద్యుడంటే శ్రీనివాస్‌కు భక్తి మెండు! అయితే శ్రీనివాస్‌ పొరుగింట్లోనే ఉండే భీంరావు, ఆయన భార్య మల్లేశ్వరిపై కన్నేశాడు. బాలుడు రిషికి కాళ్ల తిమ్మిర్ల సమస్య ఉండటంతో తండ్రి శ్రీనివాస్‌.. భీంరావును సంప్రదించాడు. చికిత్స పేరుతో రిషిని తన ఆశ్రమంలో చేర్చుకుంటే కుమారుడిని చూసేందుకు వచ్చే మల్లేశ్వరిని లోబర్చుకోవచ్చునని భీంరావు పథకం వేశాడు. రిషికి కొన్నాళ్లు ఆశ్రమంలోనే ఉంచి.. నాటువైద్యం చేయాలని తండ్రి శ్రీనివాస్‌కు చెప్పాడు. 2020 నవంబరులో రిషిని శ్రీనివాస్‌ ఆశ్రమంలో చేర్చాడు. కుమారుడిని చూసేందుకు ఆశ్రమానికి మల్లేశ్వరి రెండుసార్లు వెళ్లింది. తొలుత వెళ్లినప్పుడు.. భీంరావు తనను కొడుతున్నాడంటూ తల్లికి రిషి చెప్పుకొని ఏడ్చాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌, మల్లేశ్వరి మధ్య గొడవలు జరిగాయి. భర్త తీరుతో విసుగెత్తిన ఆమె, చిన్న కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.


అయితే.. నాటువైద్యం వికటించడంతో 2021 జనవరి చివర్లో ఆశ్రమంలోనే రిషి మృతిచెందాడు. ఈ విషయం బయటకు పొక్కితే ఆశ్రమానికి చెడ్డపేరు వస్తుందని.. మృతదేహాన్ని ఆశ్రమం వెనుకభాగంలో పాతిపెడదామని భీంరావు చెబితే శ్రీనివాస్‌ సరేన్నాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని పాతిపెట్టారు. ఇదంతా తెలియని మల్లేశ్వరి.. కుమారుడి గురించి పలుమార్లు భర్తను ఆరా తీస్తూ వచ్చింది. తొలుత బాలుడు ఆశ్రమంలోనే ఉన్నాడని చెబుతూ వచ్చిన శ్రీనివాస్‌.. ఆ తర్వాత ఆశ్రమం నుంచి బయటకు తెచ్చి హాస్టల్లో చేర్పించానని భార్యను నమ్మించాడు.


కుమారుడితో మాట్లాడించాలని ఎప్పుడు అడిగినా మూడున్నరేళ్లుగా దాటవేస్తుండటంతో మల్లేశ్వరికి అనుమానం వచ్చింది. కుమారుడి ఆచూకీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు రంగంలోకి దిగడంతో ఘోరం బయటపడింది. భీంరావును, శ్రీనివా్‌సను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ గురువారం పాసిగాం శివార్లోని ఆశ్రమానికి తీసుకెళ్లగా.. బాలుడిని పాతిపెట్టిన స్థలాన్ని వారు చూపించారు. ఆ స్థలంలో రెబ్బెన తహసీల్దార్‌ జ్యోత్స్న సమక్షంలో తవ్వగా మృతదేహం తాలూకు ఆవశేషాలు బయటపడ్డాయి. ఫోరెన్సిక్‌ వైద్యులు సురేందర్‌రెడ్డి మృతదేహానికి సంబంధించిన అస్తికలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 10:00 AM