Share News

MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోనీ.. ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్

ABN , Publish Date - Apr 15 , 2024 | 06:08 PM

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నెలకొల్పాడు. తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలచిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఘనత సాధించాడు.

MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోనీ.. ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నెలకొల్పాడు. తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలచిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆదివారం (14/04/24) ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఘనత సాధించాడు. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వేసిన 20వ ఓవర్‌లో మరో నాలుగు బంతులు మిగిలి ఉన్నప్పుడు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన ధోనీ.. తొలి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ బ్యాటర్ ఎంఎస్ ధోనీనే. అయితే.. ఓవరాల్‌గా మాత్రం సునీల్ నరైన్ (Sunil Narine), నికోలస్ పూరన్‌ల (Nicholas Pooran) తర్వాత ధోనీ మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

‘హార్దిక్ లాంటి కెప్టెన్‌ని చూడలేదు.. అతనిదంతా ఓ నటన’


మొదట ఈ హ్యాట్రిక్ సిక్సుల రికార్డ్‌ని సునీల్ నరైన్ తన పేరిట లిఖించుకున్నాడు. 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) జరిగిన మ్యాచ్‌లో.. 12వ ఓవర్‌లో అతడు వచ్చి రాగానే తొలి మూడు బంతుల్ని సిక్స్‌లుగా మలిచాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ ఇదే ఫీట్‌ని 2023లో సాధించాడు. ఆ ఏడాదిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన మ్యాచ్‌లో 16వ ఓవర్‌లో రంగంలోకి దిగి.. తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులకు మూడు సిక్సులు బాదాడు. ఇప్పుడు ఈ ఏడాదిలో ఎంఎస్ ధోనీ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ హ్యాట్రిక్ మ్యాజిక్‌ని రిపీట్ చేశాడు. ధోనీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్.. సీఎస్కే విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ధోనీ చేసిన ఆ 20 పరుగుల తేడాతోనే.. ముంబై జట్టు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రుతురాజ్ (69), శివమ్ దూబే (66) అర్థశతకాలతో అద్భుతంగా రాణించడంతో పాటు చివర్లో ధోనీ (4 బంతుల్లో 20) ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. సీఎస్కే అంత భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులే చేసి.. 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (53 బంతుల్లో 105) ఒక్కడే శతక్కొట్టగా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. తిలక్ వర్మ ఒక్కడే (31) కాస్త పర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో పాతిరానా 4 వికెట్లతో చెలరేగడంతో.. అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 06:08 PM