Share News

WPL: షఫాలీ వర్మ ఊచకోత.. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్

ABN , Publish Date - Mar 14 , 2024 | 07:55 AM

డాషింగ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) శివాలెత్తడంతో.. లీగ్‌ దశను అగ్రస్థానంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. డబ్ల్యూపీఎల్‌లో బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది.

WPL: షఫాలీ వర్మ ఊచకోత.. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్

• షఫాలీ అదిరే షో

• 7 వికెట్లతో

న్యూఢిల్లీ: డాషింగ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) శివాలెత్తడంతో.. లీగ్‌ దశను అగ్రస్థానంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. డబ్ల్యూపీఎల్‌లో బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. తొలుత గుజరాత్‌ 20 ఓవర్లలో 126/9 స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకొన్న జెయింట్స్‌ 50/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో భారతి ఫుల్మాలి (42), కేథరిన్‌ బ్రైస్‌ (28 నాటౌట్‌) ఆరో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు గౌరవప్రద స్కోరు అందించారు. కాప్‌, శిఖా పాండే, మిన్నూ మణి తలో 2 వికెట్లు పడగొట్టారు.

ఎడాపెడా బాదుడే..: గుజరాత్‌ బౌలర్లను షఫాలీ ఉతికి ఆరేయడంతో.. ఛేదనలో ఢిల్లీ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి నెగ్గింది. 4వ ఓవర్‌లో లానింగ్‌ (18) రనౌట్‌ కాగా.. క్యాప్సీ (0)ని తనూజ క్యాచవుట్‌ చేసింది. కానీ, షఫాలీ దూకుడుగా ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్‌ (38 నాటౌట్‌) ఆమెకు చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 55 బంతుల్లో 94 పరుగులు జోడించడంతో.. ఢిల్లీ అలవోకగా నెగ్గింది. విజయానికి 2 పరుగులు కావాల్సి ఉండగా.. వర్మను తనూజ అవుట్‌ చేసినా.. రోడ్రిగ్స్‌ బౌండ్రీతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేసింది.


లీగ్‌ దశలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 నెగ్గిన ఢిల్లీ.. మొత్తం 12 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. 10 పాయింట్లతో ముంబై రెండో స్థానాన్ని, 8 పాయింట్లతో బెంగళూరు మూడో స్థానాన్ని ఖరారు చేసుకొన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ టోర్నీ నుంచి అవుటయ్యాయి. ప్లేఆఫ్స్‌ రూల్స్‌ ప్రకారం టేబుల్‌ టాపర్‌ ఢిల్లీ నేరుగా టైటిల్‌ పోరుకు అర్హత సాధించగా.. తర్వాతి స్థానాల్లో నిలిచిన ముంబై, బెంగళూరు జట్లు శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. ఇందులో నెగ్గిన టీమ్‌.. ఆదివారం ఫైనల్లో ఢిల్లీని ఢీకొననుంది.

గుజరాత్‌: 20 ఓవర్లలో 126/9 (భారతి 42, బ్రైస్‌ 28 నాటౌట్‌; కాప్‌ 2/17, మణి 2/9).

ఢిల్లీ: 13.1 ఓవర్లలో 129/3 (షఫాలీ 71, జెమీమా 38 నాటౌట్‌; తనూజ 2/20).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 07:55 AM