Share News

SRH vs MI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఊచకోత.. గత రికార్డులన్నీ బద్దలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 08:41 PM

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్ములేపారు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్ పరుగుల వరద పారించారు.

SRH vs MI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఊచకోత.. గత రికార్డులన్నీ బద్దలు

హైదరాబాద్: ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్ములేపారు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్ వర్మ, ట్రావిస్ హెడ్ పరుగుల వరద పారించారు. ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అభిషేక్ శర్మ అంతకన్నా వేగంగా16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో గత రికార్డులన్నింటిని వీరిద్దరు బద్దలుకొట్టారు. 9 ఫోర్లు, 3 సిక్సులతో 24 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ 62 పరుగులు బాదేశాడు. ఆ తర్వాత 6 సిక్సులు, 2 ఫోర్లతో 16 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. వీరిద్దరి విధ్వంసంతో 10 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ మరింత రెచ్చిపోయాడు. మొత్తంగా 7 సిక్సులు, 3 ఫోర్లతో 23 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు.


1. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లోనే కాకుండా మొత్తంగా సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

2. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్ తరఫున వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

3. ముంబై ఇండియన్స్‌పై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ(16 బంతులు) నిలిచాడు. ఈ క్రమంలో గతంలో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్ రికార్డును బద్దలుకొట్టాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన పాట్ కమిన్స్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

4. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్ 81/1 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డులకెక్కింది. దీంతో 2017లో కేకేఆర్‌పై చేసిన 79 పరుగుల రికార్డు బద్దలైంది.

5. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే ట్రావిస్ హెడ్ 20 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. దీంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ తరఫున వేగంగా అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంతో 23 బంతుల్లో 59 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు.

6. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన నాలుగో జట్టుగా నిలిచింది. సన్‌రైజర్స్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన మ్యాచ్ ఇదే.

7. ఈ మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలో సన్‌రైజర్స్ ఏకంగా 148/2 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొదటి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్ర సృష్టించింది.

Updated Date - Mar 27 , 2024 | 08:53 PM