Share News

MI vs DC: ముంబై బ్యాటర్ల ఊచకత.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - Apr 07 , 2024 | 05:31 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఢిల్లీ బౌలర్లను ఊతికారేస్తూ బ్యాటింగ్ పిచ్‌పై పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్(39) విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల దుమ్ములేపారు.

MI vs DC: ముంబై బ్యాటర్ల ఊచకత.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians vs Delhi Capitals) బ్యాటర్లు ఊచకోత కోశారు. ఢిల్లీ బౌలర్లను ఊతికారేస్తూ బ్యాటింగ్ పిచ్‌పై పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్(39) విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ములేపారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ జట్టు 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 235 పరుగలు భారీ లక్ష్యాన్ని ఉంచింది. డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ విధ్వంసంతో చివరి 5 ఓవర్లలో ముంబై ఏకంగా 96 పరుగులు చేసింది. అన్రిచ్ నోర్జే వేసిన చివర్లో ఓవర్లో అయితే షెపర్డ్ విశ్వరూపం చూపించాడు. వరుసగా ఫోర్, మూడు సిక్సులు, ఫోర్, సిక్సు బాది ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఏకంగా 390 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన షెపర్డ్ 10 బంతుల్లోనే 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టిమ్ డేవిడ్ 21 బంతుల్లోనే 45 పరుగులతో అజేయంగా నిలిచాడు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఆరంభాన్నిచ్చారు. ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో రోహిత్ శర్మ చెలరేగాడు. ఇషాంత్ శర్మ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన రోహిత్.. రిచర్డ్సన్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 2 సిక్సులు బాదాడు. అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్లో ఓ సిక్సు, ఫోర్ కొట్టాడు. లలిత్ యాదవ్ వేసిన ఆరో ఓవర్లో 3 ఫోర్లు బాదాడు. దీంతో పవర్‌ప్లేలోనే ముంబై జట్టు 75 పరుగులు చేసింది. అయితే 7వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని స్పిన్నర్ అక్షర్ పటేల్ విడదీశాడు. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేయడంతో 80 పరుగుల వద్ద ముంబై మొదటి వికెట్ కోల్పోయింది. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 49 పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సూర్యకుమార్ యాదవ్‌ను అన్రిచ్ నోర్జే డకౌట్ చేశాడు.

అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ముంబై స్కోర్‌ను కిషన్ 100 పరుగులు దాటించాడు. 11వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన అక్షర్ పటేల్ ఇషాన్ కిషన్‌ను పెవిలియన్ చేర్చాడు. 23 బంతులు ఎదుర్కొన్న కిషన్ 4 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి బౌలర్ అక్షర్‌కే స్ట్రెట్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కాసేపటికే తిలక్ వర్మ(6)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. దీంతో 121 పరుగులకు ముంబై 4 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం టిమ్ డేవిడ్‌తో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై స్కోర్‌ను 180 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. మరోసారి చెలరేగిన నోర్జే ఈ భాగస్వామ్యాన్ని 18వ ఓవర్లో విడదీశాడు. 3 ఫోర్లు, ఓ సిక్సుతో 33 బంతుల్లో 39 పరుగులు చేసిన హార్దిక్‌ను ఔట్ చేశాడు.

ఇషాంత్ వర్మ వేసిన 19వ ఓవర్లో టిమ్ డేవిడ్ ఓ ఫోర్, ఓ సిక్సు, షెపార్డ్ ఓ ఫోర్ బాదడానికి తోడు మరో 3 పరుగులు రావడంతో 19 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై స్కోర్ 200 దాటింది. ఇక నోర్జే వేసిన చివరి ఓవర్లో షెపర్డ్ రెచ్చి పోయాడు. ఏకంగా 4 సిక్సులు, 2 ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. డేవిడ్, షెపార్డ్ విధ్వంసంతో చివరి 5 ఓవర్లలో ముంబై 96 పరుగులు చేసింది. వీరిద్దరు చివరి 13 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. 3 ఫోర్లు, 4 సిక్సులతో 10 బంతుల్లోనే 39 పరుగులు చేసిన షెపార్డ్, 2 ఫోర్లు, 4 సిక్సులతో 21 బంతుల్లో 45 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ బౌలర్ నోర్జే రెండు వికెట్లు తీసినప్పటికీ ఏకంగా 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..

SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?

Updated Date - Apr 07 , 2024 | 05:48 PM