Share News

SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:49 PM

ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన హైదరాబాద్ బలమైన చెన్నైసూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బౌలర్లు చెన్నైసూపర్ కింగ్స్‌ను 165 పరుగులకే కట్టడి చేశారు.

SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?
Pat Cummins why not appeal obstruction of the field

హైదరాబాద్: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad vs Chennai Super Kings) సత్తా చాటింది. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన హైదరాబాద్ బలమైన చెన్నైసూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బౌలర్లు చెన్నైసూపర్ కింగ్స్‌ను 165 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, కమిన్స్, జయదేవ్ ఉనద్కత్ సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో చివరి 5 ఓవర్లలో చెన్నై 38 పరుగులే చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ(Abhishek Sharma) సునామీ ఇన్నింగ్స్‌తో చేధించాల్సిన లక్ష్యంలో సన్‌రైజర్స్ పవర్ ప్లేలోనే దాదాపు సగం పరుగులు చేసింది. అనంతరం ట్రావిస్ హెడ్, మాక్రమ్ కూడా చెలరేగడంతో మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే హైదరాబాద్ లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది.


అయితే ఈ మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో 19వ ఓవర్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై బ్యాటింగ్ సమయంలో 19వ ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని జడేజా నేరుగా ముందుకు ఆడాడు. దీంతో అది భువి చేతుల్లోకి వెళ్లింది. అప్పటికే జడేజా క్రీజును దాటి ముందుకు వచ్చాడు. దీంతో భువి బంతిని నేరుగా స్టంప్స్ వైపు విసిరాడు. ఇది గమనించిన జడేజా కూడా స్టంప్స్ వైపుకు పరిగెత్తాడు. అయితే జడేజా అడ్డు రావడంతో బంతి అతని వీపుకు తగిలింది. ఒక వేళ జడేజా అడ్డు రాకపోయి ఉంటే బంతి నేరుగా స్టంప్స్‌కు తగిలేది. అప్పటికీ జడేజా క్రీజు బయటే ఉన్నాడు కాబట్టి రనౌట్ అయ్యేవాడు. ఒక రకంగా జడేజా ఉద్దేశపూర్వకంగా బంతికి అడ్డువచ్చినట్టుగా అనిపించింది. అయితే వెంటనే వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్‌కు సిగ్నల్ ఇచ్చాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లు యశ్వంత్ బార్డే, రోహన్ పండిట్ కూడా ఈ విషయంపై చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆశ్చర్యకరంగా బౌలర్ భువనేశ్వర్ కుమార్, కెప్టెన్ కమిన్స్ అప్పీల్ చేయలేదు.

ఒకవేళ అప్పీల్ చేసి ఉంటే జడేజాను ఔట్‌గా ప్రకటించే అవకాశాలుండేవి. అయితే ఈ విషయంపై కెప్టెన్ కమ్మిన్స్ వ్యవహార శైలి ప్రస్తుతం నెట్టింట్ వైరల్‌గా మారింది. అప్పటికే జడేజా పరుగులు చేయడానికి క్రీజులో ఇబ్బంది పడుతున్నాడు. భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. ఒక వేళ జడేజా ఔటైతే ధోని క్రీజులోకి వస్తాడు. ధోని భారీ షాట్లు ఆడే అవకాశం ఉంటుంది. అందుకే జడేజాను ఔట్ చేయకుండా క్రీజులోనే ఉంచితే పరుగులు ఎక్కువగా రాకుండా అడ్డుకోవచ్చనే ఉద్దేశ్యంతో కమిన్స్ అప్పీల్ చేయలేదని పలువురు అంటున్నారు. ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడని అంటున్నారు. ఇదే అంశంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ కూడా చేశాడు.


‘‘ జడేజా అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ విషయంలో అప్పీల్‌ను వెనక్కి తీసుకున్న కమిన్స్‌కు రెండు ప్రశ్నలు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజులోనే ఉంచి ధోనిని బయటే ఉంచడానికి పన్నిన వ్యూహామా? టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ క్రీజులో ఉంటే కూడా కమిన్స్ ఇలాగే చేస్తాడా?’’ అని రాసుకొచ్చాడు. అయితే కైఫ్ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తన జట్టును గెలిపించుకోవడం కోసం కెప్టెన్‌గా కమిన్స్ అలా చేయడంలో తప్పులేదని కొందరు అంటున్నారు. కొందరేమో కోహ్లీని మధ్యలోకి లాగడంతో కైఫ్‌పై విమర్శలు చేస్తున్నారు. మరికొందరేమో రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కాదని, ఆ విషయం తెలుసకోమని కైఫ్‌కు సూచిస్తున్నారు. కాగా చివరి ఓవర్లో మిచెల్ ఔట్ కావడంతో ధోని క్రీజులోకి వచ్చి 2 బంతులు ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


IPL 2024: దిగ్గజ బ్యాటర్ల సరసన రస్సెల్.. ఆ ఘనత సాధించిన ఆటగాడిగా..

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

Updated Date - Apr 06 , 2024 | 04:07 PM