Share News

RR vs LSG: దంచికొట్టిన శాంసన్.. లక్నో టార్గెట్ ఎంతంటే..

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:39 PM

కెప్టెన్ సంజూ శాంసన్(82) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వరుసగా ఐదో సీజన్‌లోనూ శాంసన్ తొలి మ్యాచ్‌లో 50+ స్కోర్‌తో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో 52 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

RR vs LSG: దంచికొట్టిన శాంసన్.. లక్నో టార్గెట్ ఎంతంటే..

జైపూర్: కెప్టెన్ సంజూ శాంసన్(82) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వరుసగా ఐదో సీజన్‌లోనూ శాంసన్ తొలి మ్యాచ్‌లో 50+ స్కోర్‌తో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో 52 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిడిల్ ఓవర్లలో రియాన్ పరాగ్(43), డెత్ ఓవర్లలో ధృవ్ జురేల్(20) శాంసన్‌కు సహకరించారు. యశస్వీ జైస్వాల్(24) ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 193/4 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ అద్భుత కీపింగ్‌తో స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ 11 పరుగులకే ఔట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్ వేసిన ఫుల్లర్ లెంగ్త్ బాల్ బట్లర్ బ్యాట్‌కు ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనకాల కీపర్‌కు దూరంగా పడబోయింది. దానిని కీపర్ రాహుల్ కుడి వైపునకు డైవ్ చేసి అద్భుతంగా అందుకున్నాడు. ఆ కాసేపటికే ధాటిగా ఆడుతున్న యశస్వీ జైస్వాల్‌ను మోహ్సీన్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 12 బంతుల్లోనే జైస్వాల్ 24 పరుగులు చేశాడు. దీంతో 49 పరుగులకు రాజస్థాన్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ 54/2 స్కోర్‌తో నిలిచింది.


ఈ సమయంలో కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 59 బంతుల్లో 93 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యష్ ఠాకూర్ వేసిన 9వ ఓవర్‌లో శాంసన్ 2 సిక్సులు, పరాగ్ ఓ సిక్సు బాదడంతో 21 పరుగులొచ్చాయి. రవి బిష్ణోయ్ వేసిన 11వ ఓవర్‌లో శాంసన్, పరాగ్ చెరో సిక్సు బాదడంతో 15 పరుగులొచ్చాయి. ఈ క్రమంలో రాజస్థాన్ స్కోర్ కూడా 100 పరుగులు దాటింది. అనంతరం సంజూ శాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో శాంసన్‌కు ఇది 21వ హాఫ్ సెంచరీ. వరుసగా 5 ఐపీఎల్ సీజన్లలో మొదటి మ్యాచ్‌లో శాంసన్‌ను ఇది ఐదో 50+ స్కోర్ కావడం గమనార్హం. అయితే ఈ భాగస్వామ్యాన్ని 15వ ఓవర్‌లో నవీన్ ఉల్ హక్ విడదీశాడు. ఒక ఫోర్, 3 సిక్సులతో 29 బంతుల్లో 43 పరుగులు చేసిన పరాగ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే షిమ్రోన్ హెట్‌మేయర్(5)ను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేర్చాడు. దీంతో 150 పరుగులకు రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయింది. డెత్ ఓవర్లలో సంజూ శాంసన్, ధృవ్ జురేల్ చెలరేగారు. చివరి 21 బంతుల్లోనే 43 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 3 ఫోర్లు, 6 సిక్సులతో 52 బంతుల్లోనే 82 పరుగులు చేసిన శాంసన్.. ఒక ఫోర్, ఒక సిక్సుతో 12 బంతుల్లో 20 పరుగులు చేసిన ధృవ్ జురేల్ నాటౌట్‌గా నిలిచారు. నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీయగా.. మోహ్సీన్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RR vs LSG: వాట్ ఏ క్యాచ్ రాహుల్.. గాయం తర్వాత కూడా సూపర్ కీపింగ్


IPL 2024: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే? సాక్ష్యం ఇదిగో!


Updated Date - Mar 24 , 2024 | 05:52 PM