Share News

IND vs ENG: వైజాగ్ టెస్టులో అతడిని ఆడించండి.. టీమిండియాకు అనిల్ కుంబ్లే కీలక సూచన

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:54 PM

వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఒకే పేసర్ చాలు అనుకుంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకువాలని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే టీమిండియాకు సూచించాడు. అయితే జట్టుకు నాల్గో స్పిన్నర్ అవసరమా లేదా అనేది తనకు కచ్చితంగా తెలియదని చెప్పాడు.

IND vs ENG: వైజాగ్ టెస్టులో అతడిని ఆడించండి.. టీమిండియాకు అనిల్ కుంబ్లే కీలక సూచన

వైజాగ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఒకే పేసర్ చాలు అనుకుంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకువాలని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే టీమిండియాకు సూచించాడు. అయితే జట్టుకు నాల్గో స్పిన్నర్ అవసరమా లేదా అనేది తనకు కచ్చితంగా తెలియదని చెప్పాడు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. బుమ్రా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, మరో పేసర్ సిరాజ్ మాత్రం తేలిపోయాడు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన సిరాజ్ 11 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయితే పరుగులు కూడా ఎక్కువగా ఇచ్చాడు. అదే సమయంలో ఒక పేసర్, నలుగురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మంచి ఫలితాన్ని రాబట్టింది. ఈ నేపథ్యంలో వైజాగ్ టెస్టుకు టీమిండియా ఎలాంటి బౌలింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే జియో సినిమా వేదికగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఈ అంశంపై మాట్లాడాడు.


‘‘రెండో టెస్టులో టీమిండియాకు ఒకే ఫాస్ట్ బౌలర్ చాలని భావిస్తే, నాలుగో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఆడించడం మంచిది. ఎందుకంటే అతని బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. ఇంగ్లండ్ మాత్రం హైదరాబాద్‌లో మాదిరిగానే నలుగురు స్పిన్నర్లు, ఒక పేసర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగొచ్చు. వైజాగ్ పిచ్‌లో టర్నింగ్ ఉండొచ్చు. మేము కొంత పేస్‌ను కూడా ఆశిస్తున్నాం.’’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. కాగా స్పిన్ బౌలర్ అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు. రెండో టెస్టుకు రవీంద్ర జడేజా దూరం అయినప్పటికీ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వైపే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఒక వేళ నాలుగో స్పిన్నర్ కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ తుది జట్టులో కచ్చితంగా ఉండొచ్చు. అయితే ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో భారత బ్యాటర్లు మరింత సానుకూల దృక్పథంతో ఉండాలని, స్పిన్‌కు సరైన ఫుట్‌వర్క్‌తో ఆడాలని అనిల్ కుంబ్లే సూచించాడు. స్పిన్ ఆడే విషయంలో టీమిండియా బ్యాటర్లు కట్టుదిట్టంగా ఉండాలని చెప్పాడు. హదరాబాద్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆడిన విధానానికి ధన్యవాదాలు చెప్పిన కుంబ్లే.. వైజాగ్ టెస్టులో టీమిండియా గెలవాలంటే మెరుగైన ప్రణాళికలు, వైవిధ్యాలతో బరిలోకి దిగాలని సూచించాడు. కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 01:02 PM