Share News

Ranji Trophy: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. 8 వికెట్లతో భువనేశ్వర్ విశ్వరూపం

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:39 PM

రంజీ ట్రోఫీ 2024లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చెలరేగుతున్నాడు. లీగ్ దశ పోటీల్లో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే విశ్వరూపం చూపించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు.

Ranji Trophy: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. 8 వికెట్లతో భువనేశ్వర్ విశ్వరూపం

కాన్పూర్: రంజీ ట్రోఫీ 2024లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చెలరేగుతున్నాడు. లీగ్ దశ పోటీల్లో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే విశ్వరూపం చూపించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. భువి దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ జట్టు 188 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌కు అనుకులించిన పిచ్‌పై భువిని ఎదుర్కొలేక బెంగాల్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా ఈ టోర్నీలో భువనేశ్వర్ కుమార్ ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగాల్‌ను భువి వణికించాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తొలి రోజే 5 వికెట్లు పడగొట్టాడు. రెండు రోజు ఆటలోనూ 3 వికెట్లతో బెంగాల్ నడ్డి విరిచాడు. మొత్తంగా 22 ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ 41 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.


చాలా రోజుల తర్వాత భువి అద్భుత ప్రదర్శన చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే యూపీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ కావడంతో బెంగాల్‌ను 128 పరుగుల అధిక్యం లభించింది. గతంలో టీమిండియాలో కీలక బౌలర్‌‌గా ఉన్న భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయాడు. ఫామ్ లేమికి తోడు యువ ఆటగాళ్లు జట్టులోకి దూసుకురావడంతో భువికి చోటు దక్కలేదు. టీమిండియాకు భువి చివరగా 2022లో ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియాలో లేకపోయినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో భువనేశ్వర్ కుమార్ కీలక బౌలర్‌గా ఉన్నాడు. రానున్న సీజన్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్ తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో రంజీ ట్రోఫీలో భువి అద్భుత ప్రదర్శన కనబర్చడం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. రానున్న ఐపీఎల్‌లోనూ భువి ఇలాంటి ప్రదర్శనే కొనసాగించాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 12:39 PM