AP Elections 2024: జనసేన పోటీ చేసే 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలివే.. అంతా ఓకే కానీ..?
ABN , Publish Date - Feb 26 , 2024 | 09:00 AM
TDP-Janasena: తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేనకు (TDP-Janasena) కేటాయించే సీట్లపై క్రమంగా స్పష్టత వస్తోంది. తాము 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీ సీట్ల పరిధిలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 45 సీట్లలో తమ పోటీ ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు..
(అమరావతి–ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేనకు (TDP-Janasena) కేటాయించే సీట్లపై క్రమంగా స్పష్టత వస్తోంది. తాము 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీ సీట్ల పరిధిలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 45 సీట్లలో తమ పోటీ ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరంలో పోటీచేసే తమ అభ్యర్థుల పేర్లను ఆయన శనివారమిక్కడ టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రకటించారు. రాజోలులో తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ గతంలో చెప్పారు. అంటే ఇప్పటికి ఆరు స్థానాలపై స్పష్టత వచ్చింది. రెండు పార్టీల ఆంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం.. మిగిలిన 18 స్థానాల్లో మెజారిటీ సీట్లు ఖరారయ్యాయి. వాటిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, అమలాపురం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం.. ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, ఉమ్మడి విశాఖ జిల్లాలో యలమంచిలి.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేనకు ఖరారైనట్లు వినవస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీ తీసుకుంటున్నందుకు బదులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నిడదవోలు స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ గతంలో దర్శి సీటు కోరగా తాజాగా గిద్దలూరు ఆ పార్టీ ఖాతాలో పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం లేదా పుట్టపర్తి ఇవ్వాలని కూడా కోరుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె స్థానం ఆ పార్టీకి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కడప జిల్లా బద్వేలు లేదా రైల్వే కోడూరు కూడా ఆ పార్టీ ఆశిస్తున్నవాటిలో ఉన్నాయి. మూడు ఎంపీ సీట్లలో మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లిలో జనసేన పోటీ చేయనుంది.

జనసేన ఫోకస్ అంతా విశాఖ, గోదావరిపైనే..!
బలమైన అభిమానులు ఉన్న పార్టీయే అయినా.. ఆ అభిమానాన్ని ఓటర్లు మలిచే నాయకులే కరువని జనసేన ముఖ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలాబలాలను, నాయకుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్లు జనసేనాని టీడీపీతో పొత్తులో భాగంగా 24 సీట్లలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారని వారు అంటున్నారు. వీటిలో కూడా అత్యధికంగా 14 స్థానాలను విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే కోరుతున్నట్లు తెలిసింది. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, విశాఖపట్నం–అనకాపల్లి, తూర్పుగోదావరి–రాజానగరం, కాకినాడ రూరల్.. గుంటూరు జిల్లాలో తెనాలిలో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు. మిగతా 19 నియోజకవర్గాల్లో కూడా విశాఖ, ఉభయగోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు పొందాలని భావిస్తున్నారు. ఉమ్మడి విశాఖలో యలమంచిలి, భీమిలి, గాజువాక, పెందుర్తి స్థానాలను కోరుతున్నారు.. తూర్పుగోదావరి రాజోలులో తామే పోటీ చేస్తామని పవన్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు పిఠాపురం, రామచంద్రపురం లేదా అమలాపురం కోరుతున్నారు. పశ్చిమ గోదావరిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సీట్లను ఆశిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి