Share News

PM Modi: ఖర్గే అంత స్వేచ్ఛగా స్పీచ్ ఎలా ఇచ్చారంటే... ప్రధాని ఆసక్తికర వివరణ

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:23 PM

బీజేపీకి 400 సీట్లకు పైనే రావచ్చంటూ కాంగ్రెస్ రాజ్యసభ నేత మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దల సభలోనే ఛలోక్తులు విసిరారు. ఖర్గే ఇంత స్వేచ్ఛగా సభలో ఎక్కువ సేపు మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టారని చెప్పారు.

PM Modi: ఖర్గే అంత స్వేచ్ఛగా స్పీచ్ ఎలా ఇచ్చారంటే... ప్రధాని ఆసక్తికర వివరణ

న్యూఢిల్లీ: బీజేపీకి 400 సీట్లకు పైనే రావచ్చంటూ కాంగ్రెస్ రాజ్యసభ నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తన ప్రసంగంలో చెప్పడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్వాగతించారు. బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై రాజ్యసభలో జరిగిన ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి బుధవారంనాడు సమాధామిచ్చారు. ఖర్గే ఇంత స్వేచ్ఛగా సభలో ఎక్కువ సేపు మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా ప్రధాని స్పందించారు.


''కాంగ్రెస్‌కు 40 సీట్లు రావాలని నేను ప్రార్ధిస్తున్నాను. ఖర్గే ప్రసంగం విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎన్నో విషయాలు ఆయన చాలా స్వేచ్ఛగా మాట్లాడారు. ఇదెలా సాధ్యమైందని ఆలోచించాను. అప్పుడు ఆ ఇద్దరు కమాండర్లు (సోనియాగాంధీ, రాహుల్ గాంధీ) సభలో లేరనే విషయం గ్రహించారు. బహుశా ఇలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందని ఖర్గే అనుకుని ఉండవచ్చు. వరుసగా ఫోర్సు, సిక్సర్సు కొట్టారు'' అంటూ మోదీ చమత్కరించారు.


కుటుంబ సభ్యులకు 'భారతరత్న' ఇచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలో కుటుంబ సభ్యులకు భారతరత్న ఇచ్చిందని, కుటుంబ సభ్యుల పేర్లే రోడ్లకు పెట్టిందని ప్రధాన మంత్రి మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారని తాను అడగడం లేదని, బ్రిటిషర్ల ప్రభావం మీమీద లేదా అని మాత్రమే తాను అడుగుతున్నానని అన్నారు. రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా ఎందుకు మీరు మార్చలేదు? వార్ మెమేరియల్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ప్రాంతీయ భాషలపై ఎందుకు దృష్టి పెట్టలేదు? అని మోదీ ప్రశ్నించారు.


కులగణన డిమాండ్‌పై విసుర్లు..

కులగణన అంటూ కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌పై మోదీ మాట్లాడుతూ, దళిత్-పిచ్చా-ఆదివాసీలకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమేనని ఆరోపించారు. ఎలాంటి రిజర్వేషన్లను, ముఖ్యంగా ఉద్యోగాల్లో కోటాకు తాను వ్యతిరేకమని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అప్పటి ముఖ్యమంత్రులకు లేఖ రాసారని, ఈ వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే పని ప్రమాణాలు తగ్గిపోతాయని నెహ్రూ భావనగా ఉండేదన్నారు. ఒకప్పుడు వాళ్లే కాదనుకున్న ఈ డిమాండ్‌ను ఇప్పుడు వాళ్లే (కాంగ్రెస్) ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. శామ్ పిట్రోడాను ప్రధాని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ మార్గదర్శకులలో ఒకరు అమెరికాలో కూర్చుంటారని, ఇటీవల ఆయన రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ అబేంద్కర్ పాత్రను తక్కువ చేస్తూ, నెహ్రూ చాలా కీలక పాత్ర పోషించారంటూ చెప్పారని అన్నారు.


మోదీ 3.0 దగ్గర్లోనే ఉంది..

కేంద్రంలో తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి ఇంకెంతో దూరం లేదని ప్రధాని మోదీ అన్నారు. కొందరు దీనిని మోదీ 3.0 అని అంటున్నారని చెప్పారు. మోదీ 3.0లో వికసిత్ భారత్‌ను మరింత పటిష్టం చేస్తామని, రాబోయే ఐదేళ్లలో మెడికల్ కాలేజీలు పెరుగుతాయని, అనేక మంది డాక్టర్లు వస్తారని, చికిత్స ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు.

Updated Date - Feb 07 , 2024 | 04:26 PM