Robbery: ఇదేం దోపిడీరా అయ్యా.. ఇలా కూడా ఉంటారా దొంగలు..!
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:56 PM
Karnataka: దొంగలు చోరీ చేయాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకుంటారు. తమకు అనుకూల పరిస్థితులు ఉండే ప్రాంతం, ఇళ్లను చూసుకుంటారు. దాదాపుగా అయితే ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. దొంగల ఏకైక లక్ష్యం దోపిడీనే అయినా.. వారు చోరీ చేసే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది.

Karnataka: దొంగలు చోరీ చేయాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకుంటారు. తమకు అనుకూల పరిస్థితులు ఉండే ప్రాంతం, ఇళ్లను చూసుకుంటారు. దాదాపుగా అయితే ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. దొంగల ఏకైక లక్ష్యం దోపిడీనే అయినా.. వారు చోరీ చేసే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ స్టైల్ కూడా చాలా వెరైటీనే అని చెప్పాలి. అవును, దొంగలందు నేను వేరయా అంటున్నాడు ఈ చోరుడు. ఇంటి గుమ్మం ముందు పూజలు చేసి మరీ దోపిడీలకు పాల్పడుతున్నాడు. తాజాగా ఓ ఇంటి ముందు పూజలు చేసి ఆ ఇంటిని కొల్లగొట్టాడు దొంగ. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే వివరాలు తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.
కర్ణాటక రాష్ట్రంలో మైసూరు జిల్లాలో విచిత్రమైన రీతిలో దొంగతనం జరిగింది. దొంగ భారీ ఎత్తున నగలు, డబ్బు ఎత్తుకెళ్లినా.. అతడు చోరీ చేసిన విధానం భయానకంగా ఉంది. జేపీ నగర్‌లో అర్థరాత్రి సమయంలో సినిమా రేంజ్‌లో చోరీ జరిగింది. ఓ ఇంట్లో దూరిన దొంగ ఇంటి తాళం పగలగొట్టే ముందు గుమ్మం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. నిమ్మకాయలు, ముగ్గు, పసుపు, కుంకుమతో పూజ చేశాడు. అనంతరం ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి దూరాడు. దొంగ ఇంట్లో ఉండగానే.. ఆ ఇంటి యజమాని వచ్చేశాడు. దీంతో షాక్ అయిన దొంగ.. తన వద్దనున్న కత్తి, మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయాడు. 135 గ్రాములకు పైగా బంగారం, కొంత డబ్బు దోచికెళ్లాడు. బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గుమ్మానికి నమస్కరించి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దొంగ చోరీకి ముందు గుమ్మం ఎదుట పూజలు చేశాడు. నిమ్మకాయలు కట్ చేసి గుమ్మానికి ఇరువైపులా పెట్టాడు. వాటిపై కుంకుమ, పసుపు చల్లాడు. గుమ్మం ముందు పసుపు, కుంకమతో ఒక రకమైన ముగ్గు వేసి, మధ్యలో నిమ్మకాయ పెట్టాడు. అనంతరం ఇంటి తలుపులకు నమస్కరించాడు. తన వెంట తెచ్చుకున్న సామాగ్రితో ఇంటి తాళం పగలగొట్టాడు.