Share News

మాస్టర్ ప్లాన్.. పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:29 AM

మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక వెల్లడించింది.

మాస్టర్ ప్లాన్.. పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!

  • వారి దేశంలోనే స్పాట్‌..

  • 2020 నుంచి 20 మంది హతం

  • స్థానిక యువతతో ఆపరేషన్లు..

  • వారికి పెద్ద ఎత్తున డబ్బులు

  • పాక్‌ టెర్రరిస్టులపై రా గురి!

లండన్‌, ఏప్రిల్‌ 5: మోదీ(PM Modi) రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో(Pakistan) భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని బ్రిటన్‌కు(London) చెందిన గార్డియన్‌ పత్రిక వెల్లడించింది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని, ఈ హత్యలు భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌’ (రా) పర్యవేక్షణలో జరిగాయని ఆరోపించింది. ఈ మేరకు భారత్‌, పాకిస్థాన్‌ నిఘా, గూఢచార సంస్థల అధికారులతో గార్డియన్‌ ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలిపింది. రా ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కాగా, ఇటువంటి అనధికారిక ఆపరేషన్ల గురించి గతంలో రా వర్గాలు స్పందించేవి కావని, కానీ, ఈసారి మాత్రం రా అధికారులు తమ ప్రతినిధితో వివరంగా మాట్లాడటం గమనార్హమని గార్డియన్‌ పేర్కొంది.

ఈ మేరకు ఇద్దరు రా అధికారులను ఉటంకిస్తూ.. 2019లో జరిగిన పుల్వామా దాడి అనంతరం రా వ్యూహం మారిందని, భారత వ్యతిరేక శక్తులు భారత్‌లో దాడికి దిగకముందే వారిని గుర్తించి నిర్మూలించటం అనే కొత్త పంథాను ఎంచుకున్నారని తెలిపింది. ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొసాద్‌, రష్యా గూఢచార సంస్థ కేజీబీల నుంచి ఈ మేరకు స్ఫూర్తి తీసుకున్నామని, ఇటువంటి ఆపరేషన్లకు ప్రభుత్వంలో అత్యున్నతస్థాయి ఆమోదం తప్పనిసరి అని సదరు అధికారులు చెప్పినట్లు ఈ కథనం వెల్లడించింది. 2018లో సౌదీఅరేబియా ప్రభుత్వ విమర్శకుడు, జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య కూడా తమను ఆలోచింపజేసిందని ఆ అధికారులు తెలిపారు.

‘హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రధాని కార్యాలయంలో రా అత్యున్నతస్థాయి అధికారులు సమావేశమయ్యారు. సౌదీలు ఇటువంటి పని చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఓ అధికారి ప్రశ్నించారు’ అని వెల్లడించారు. మరోవైపు, గార్డియన్‌ ప్రతినిధి పాకిస్థాన్‌ గూఢచర్య, నిఘా సంస్థలతో కూడా మాట్లాడారు. 2020 నుంచీ తమ దేశంలో ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని, 2023లో వీటి సంఖ్య బాగా పెరిగిందని, ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు 15 మంది హత్యకు గురయ్యారని పాక్‌ వర్గాలు తెలిపాయి. అన్నీ కూడా గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సంభవించిన మరణాలేనని పేర్కొన్నారు.

యూఏఈ కేంద్రంగా రా అధికారులు స్లీపర్‌ సెల్స్‌ను ఏర్పాటు చేశారని, పాకిస్థాన్‌లోని నిరుపేద యువకులను చేరదీసి పెద్ద ఎత్తున డబ్బులను ఎరజూపి ఈ హత్యలకు పురమాయిస్తున్నారని తెలిపారు. అయితే, ఈ హత్యల పరంపర ఈ ఏడాది నుంచి నిలిచిపోయింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీ్‌పసింగ్‌ నిజ్జర్‌ హత్య, అమెరికాలో మరో ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర నేపథ్యంలో అటు కెనడా, ఇటు అమెరికా ప్రభుత్వాలు భారత్‌ ప్రమేయంపై బహిరంగంగా ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌లో లక్ష్యిత హత్యలు నిలిపివేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయని రా అధికారి ఒకరు వెల్లడించినట్లు గార్డియన్‌ పేర్కొంది. అయితే, ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగశాఖ పేర్కొన్నట్లుగా గార్డియన్‌ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2024 | 11:12 AM