Share News

Devendra Fadnavis: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ ప్రస్థానం ఇదే..

ABN , Publish Date - Nov 26 , 2024 | 01:05 PM

దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజకీయ జీవితాన్ని 1990ల మధ్యలో ప్రారంభించారు. అప్పట్నుంచి ఆయన వివిధ పదవులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. రాజకీయ పార్టీ, ఎన్నికైన పదవులకు నాయకత్వ పాత్రలు పోషించారు.

Devendra Fadnavis: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ ప్రస్థానం ఇదే..
Devendra Fadnavis

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‪పూర్‌లోని మరాఠీ బ్రాహ్మణ హిందూ కుటుంబంలో గంగాధర్ ఫడ్నవీస్, సరితా ఫడ్నవీస్‌లకు జన్మించారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన పాఠశాల విద్యను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీదుగా ఉన్న ఇందిరా కాన్వెంట్‌లో చదివారు. ఆయన తన హైయర్ సెకండరీని ధరమ్‌పెత్ జూనియర్ కాలేజీ నాగ్‌పూర్‌లో అభ్యసించారు. 1992లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఎల్ఎల్‌బీ డిగ్రీ పట్టా పొందారు. అనంతరం డీఎస్సీ జర్మన్ ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషల్ డెవలప్మెంట్ ఇన్ బెర్లిన్ నుంచి డిప్లొమా ఇన్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు.


ఫడ్నవీస్ రాజకీయ జీవితం..

దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజకీయ జీవితాన్ని 1990ల మధ్యలో ప్రారంభించారు. అప్పట్నుంచి ఆయన వివిధ పదవులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. రాజకీయ పార్టీ, ఎన్నికైన పదవులకు నాయకత్వ పాత్రలు పోషించారు. కళాశాల విద్యార్థిగా ఆయన బీజేపీ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో క్రియాశీలక సభ్యుడుగా పని చేశారు. 1992లో 22 సంవత్సరాల వయస్సులో కార్పొరేటర్ అయ్యారు. 1997లో నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫడ్నవీస్ రెండో అతిపిన్న వయస్కుడైన మేయర్ అయ్యారు.


2004లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దేశ్‌ముఖ్ రంజిత్ బాబుపై ఆయన 17,610 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఫడ్నవీస్ పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రేపై ఆయన గెలుపొందారు. 2010లో మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. 2013లో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ నియమితులయ్యారు.


బీజేపీ విజయం తర్వాత 31, అక్టోబర్ 2014న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తిరిగి ఎన్నికయ్యారు. 2019లో భారీ రాజకీయ గందరగోళం తర్వాత నవంబర్ 23న ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఫడ్నవీస్ ఏర్పాటు చేశారు. అయితే మూడు రోజులకే మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2022లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు.


వ్యక్తిగత జీవితం..

దేవేంద్ర ఫడ్నవీస్.. బ్యాంకర్, సామాజిక కార్యకర్త అయిన అమృతా ఫడ్నవీస్‌ను వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ దివిజా ఫడ్నవీస్ అనే కుమార్తె ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ నికర విలువ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. సుమారు రూ.5.2 కోట్లు. ఇందులో రూ.56 లక్షల విలువైన చరాస్తులు ఉండగా.. వ్యవసాయ భూమి, నివాస ఆస్తులు సహా రూ.4.6 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అతని భార్య అమృతా ఫడ్నవీస్ నికర విలువ దాదాపు రూ.7.9 కోట్లు, చరాస్తులు రూ.6.9 కోట్లు, స్థిరాస్తులు రూ.95 లక్షలు. మొత్తం కలిపి వారిద్దరి నికర విలువ దాదాపు రూ.13 కోట్లు.

Updated Date - Nov 26 , 2024 | 01:06 PM