Share News

Farmers Protest: పంజాబ్, హర్యానా బార్డర్ వద్ద హై టెన్షన్.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ABN , Publish Date - Feb 13 , 2024 | 01:57 PM

రైతులపై ఢిల్లీ పోలీసులు తమ జులుం విదిల్చారు. ర్యాలీగా వచ్చిన రైతన్నలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై కఠినంగా ప్రవర్తించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని అన్నదాతలు ఈ రోజు ఆందోళనకు చేపట్టిన సంగతి తెలిసిందే.

Farmers Protest: పంజాబ్, హర్యానా బార్డర్ వద్ద హై టెన్షన్.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఢిల్లీ: రైతులపై ఢిల్లీ పోలీసులు తమ జులుం విదిల్చారు. ర్యాలీగా వచ్చిన రైతన్నలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై కఠినంగా ప్రవర్తించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఈ రోజు అన్నదాతలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. నిరసన ప్రదర్శన చేపట్టేందుకు ర్యాలీగా ఢిల్లీ బయల్దేరారు. రైతు నేతలను, రైతులను పోలీసులు (Police) ఎక్కడిక్కడే నిలువరించారు. పంజాబ్, హర్యానా సరిహద్దులో గల శంభు వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. వారిని వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. తాము వెళ్లమని, ఢిల్లీ వెళతామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అన్నదాతలు చెల్లా చెదురు అయ్యారు.

6 నెలలకు సరిపడ ఆహార పదార్థాలు

తమ డిమాండ్లు తీర్చే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని రైతు నేతలు తెగేసి చెప్పారు. ఢిల్లీలోకి అనుమతించకుంటే సరిహద్దుల్లో ఉంటామని చెబుతున్నారు. ఆరు నెలలకు సరిపడ సరుకులు తమ వెంట ఉన్నాయని వెల్లడించారు. ఆహార పదార్థాలు, మందులు, డీజిల్, నిత్యావసర సరుకులు ఉన్నాయని చెబుతున్నారు. డిమాండ్ల సాధన కోసం తగ్గేదేలే అంటున్నారు. 2020లో నల్ల చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ తరహాలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

హామీలు నెరవేర్చండి

వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. రహదారులను పోలీసులు బ్లాక్ చేస్తే వాటిని ఎలా బద్దలు కొట్టాలో తమకి తెలుసు అంటున్నారు. ఢిల్లీని అష్టదిగ్బందిస్తామని తేల్చి చెప్పారు. దేశ రాజధాని నడిబొడ్డున తమ గొంతు వినిపిస్తామని రైతులు స్పష్టం చేశారు. మరోవైపు అంబాల హైవేకి భారీగా రైతులు చేరుకున్నారు. రైతులు ఒక్కసారిగా రావడంతో హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో 11 కంపెనీల బలగాలను మొహరించారు.

రైతుల డిమాండ్లు ఇవే

1. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి

2. రైతులకు రుణమాఫీ చేయాలి

3. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి

4. 2020 విద్యుత్ సవరణ చట్టం ద్వారా వచ్చే ఒఫ్పందాలు రద్దు చేయాలి

5. ఉత్తరప్రదేశ్ లఖిమ్ పూర్ ఖేరి మృతులకు పరిహారం ఇవ్వాలి

6. 2020లో ఆందోళన చేసిన సమయంలో నమోదు చేసిన కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలి.

వీటిలో కనీసం మద్దతు ధర, విద్యుత్ సవరణ చట్టం ఒప్పందాలు రద్దు చేయాలి, రుణ మాఫీ, స్వామి నాథన్ సిఫారసులపై హామీ ఇచ్చినా సరేనని రైతులు స్పష్టం చేశారు. ఆ నాలుగు డిమాండ్లపై కేంద్ర మంత్రుల బృందం రైతు నేతలకు హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 02:00 PM