Share News

Haldwani: హల్ద్వానీ ఘటనలో కీలక సూత్రధారి అరెస్టు.. హింసకు కారణమిదే..

ABN , Publish Date - Feb 24 , 2024 | 09:20 PM

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ హింస ఘటనలో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 8న నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో హింస చెలరేగింది. బంభూల్‌పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చేశారు.

Haldwani: హల్ద్వానీ ఘటనలో కీలక సూత్రధారి అరెస్టు.. హింసకు కారణమిదే..

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ హింస ఘటనలో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 8న నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో హింస చెలరేగింది. బంభూల్‌పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చేశారు. ఇవి అక్రమ నిర్మాణాలని, ప్రభుత్వ భూమిలో ఉన్నాయంటూ మునిసిపల్ అధికారులు కూల్చేశారు. దీంతో అక్కడ హింస చేలరేగింది. స్పాట్ కు చేరుకున్న నిరసనకారులు రాళ్లు రువ్వడం, కార్లు తగులబెట్టడం వంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టిన మూక.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కాల్చివేయాలంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు, అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 78 మందిని అరెస్టు చేశారు. తాజాగా ప్రధాన సూత్రధారి మాలిక్ ను అరెస్టు చేశారు.

హింస జరిగిన రోజు మాలిక్ డెహ్రాడూన్‌లో ఉన్నాడు. పోలీస్ స్టేషన్‌పై దాడి, కూల్చివేత సమయంలో అల్లర్లు, పార్కింగ్ లోని వాహనాల ధ్వంసంపై ఈ కేసులో నిందితుడిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కూల్చివేతకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మాలిక్ నాయకత్వం వహించారని నైనిటాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. మాలిక్ భార్య సఫియా ఇటీవల ఉత్తరాఖండ్ హైకోర్టులో రిట్ పిటిషన్‌లో ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించారు. ఈ స్థలాన్ని 1937లో బ్రిటిష్ ప్రభుత్వం లీజుకు తీసుకుంది, ఇలా 2013లో తన తండ్రి మరణం తర్వాత ఆమెకు వారసత్వంగా సంక్రమించిందని పిటిషన్ లో జతచేసింది.


ఆస్తిపై ఫ్రీహోల్డ్ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని 2007లోనే కోర్టు ఆదేశించినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆ ప్రక్రియ సజావుగా సాగలేదు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుంది. అంతే కాకుండా ఫిబ్రవరి 8న హింసాకాండలో ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్ట నివారణకు రూ. 2.44 కోట్లు డిపాజిట్ చేయాలని నోటీసులు ఇచ్చింది. చనిపోయిన వ్యక్తి పేరును ఉపయోగించి అక్రమంగా ప్లాట్లు, అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మాలిక్, అతని భార్య సఫియాతో పాటు మరో నలుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 09:23 PM