Share News

PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..

ABN , Publish Date - May 16 , 2024 | 03:30 AM

‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్‌ సీఎన్‌ఎన్‌-న్యూ్‌స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు.

PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..

  • అలా చేస్తే రాజకీయాలకు అర్హుడినే కాదు!

  • మా ఇంట్లో ఈద్‌ జరిపేవాళ్లం.. ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారు

  • ‘గోద్రా’ తర్వాత నా ప్రతిష్ఠను దెబ్బతీశారు

  • ప్రతిపక్షాలు పూర్తిగా విఫలం.. ఇక పాలనలో ఎలా సక్సెస్‌ అవుతారు: మోదీ

న్యూఢిల్లీ, మే 15: ‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్‌ సీఎన్‌ఎన్‌-న్యూ్‌స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు. ‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారంటే దానర్థం వారు ముస్లింలు అనేనా? వారి పట్ల అంత అన్యాయంగా ఎలా వ్యవహరిస్తారు? కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి పోషణ, విద్య, వస్త్రాల కొనుగోలు మొదలైనవి కష్టమవుతాయి.


మతంతో సంబంధం లేకుండా పేదలందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది’ అని తెలిపారు. చిన్నతనంలో తమ ఇరుగుపొరుగున ముస్లిం కుటుంబాలు ఉండేవని.. వారి ఆచార వ్యవహారాలను దగ్గరగా చూసి అర్థం చేసుకున్నానని చెప్పారు. ‘ఇతర పండుగల్లాగే మా ఇంట్లో ఈద్‌ కూడా జరిపేవాళ్లం. ఆ రోజున ఇంట్లో వంటచేసేవాళ్లు కాదు. పొరుగున ఉన్న ముస్లింల ఇళ్ల నుంచి భోజనం వచ్చేది. మొహర్రం ఊరేగింపులకు వెళ్లేవాళ్లం. తజియా (మహ్మద్‌ ప్రవక్త మనవడు ఇమాం హసన్‌ సమాధి ప్రతిరూపం)ను మోసేవాళ్లం. అలాంటి సమాజంలో నేను పెరిగాను. నాకు పలువురు ముస్లిం స్నేహితులు ఉన్నారు. కానీ ఈ కోణాన్ని ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా నాకు మద్దతిచ్చే ముస్లింలు చాలా మంది ఉన్నారు. అయితే మీరు ఇది చేయాలి.. ఇది చేయాలంటూ వారిని నిర్దేశించే శక్తి వేరే ఉంది. 2002లో గోద్రా ఘటన తర్వాత నా ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారు’ అని అన్నారు.


నేను ప్రజాస్వామ్యవాదిని..

తాను ప్రజాస్వామ్యవాదినని.. 2014 నుంచి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా.. అందులో అతి పెద్ద విపక్షానికి చెందిన నేతను వివిధ కమిటీల్లో నియమించేలా చట్టం తీసుకొచ్చానని మోదీ తెలిపారు. అలా చేయకపోయినా ఇబ్బంది లేదని.. కానీ చేశానని చెప్పారు. 400కిపైగా సీట్లను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ప్రతిపక్షం బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘అయితే బలమైన ప్రతిపక్షమని అంటే.. పార్లమెంటు జరక్కుండా రచ్చరచ్చచేయడం కాదు. అది అప్రజాస్వామికం. దురదృష్టవశాత్తూ.. గత పదేళ్లలో ఆయా పార్టీలు తమ విపక్ష పాత్రను సక్రమంగా పోషించడంలో విఫలమయ్యాయి. ప్రతిపక్షంగానే విఫలమైనవారు పాలనలో ఎలా విజయవంతమవుతారు’ అని నిలదీశారు. భారత్‌కు దృఢమైన ప్రజాస్వామ్యం ఉండాలని.. ఇందుకోసం పటిష్ఠ ప్రతిపక్షం ఉండాలని అన్నారు. అందుకే చిన్న చిన్న పార్టీలన్నీ కాంగ్రె్‌సలో విలీనం కావాలని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ మంచి సలహాయే ఇచ్చారని.. ఇదే జరిగితే గౌరవప్రదమైన విపక్షం ఏర్పడుతుందని చెప్పారు. ‘అయితే విలీనమైతే.. ఈ ఎన్నికల్లో వచ్చే సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడడం సాధ్యం కాదు. గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా ఆవిర్భవించడానికి తగినన్ని సీట్లు వాటికి రావు’ అని ప్రధాని స్పష్టం చేశారు.

Updated Date - May 16 , 2024 | 03:31 AM