Share News

Lok Sabha Elections: సీపీఐ మేనిఫెస్టో విడుదల.. పార్లమెంటు పరిధిలోకి ఈడీ, సీబీఐని తెస్తామని వాగ్దానం

ABN , Publish Date - Apr 06 , 2024 | 09:11 PM

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సీపీఐ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారంనాడిక్కడ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చింది.

Lok Sabha Elections: సీపీఐ మేనిఫెస్టో విడుదల.. పార్లమెంటు పరిధిలోకి ఈడీ, సీబీఐని తెస్తామని వాగ్దానం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) మేనిఫెస్టో (Manifesto)ను సీపీఐ (CPI) విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D Raja) శనివారంనాడిక్కడ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చింది. తద్వారా వారి దర్యాప్తులో నిష్పాక్షికతకు అవకాశం కల్పించడం, అనవసర జోక్యాన్ని నివారించడం జరుగుతుందని తెలిపింది. ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, సెక్యులరిజం, ఫెడరలిజం సిద్ధాంతాలను ప్రమోట్ చేసేందుకు సీపీఐ పోరాటం సాగిస్తుందని డి.రాజా తెలిపారు.


''పెరుగుతున్న అసమానత్వాన్ని తొలగించేందుకు అవసరమైన చర్యలను సీపీఐ తీసుకుంటుంది. సంపద పన్ను, వారసత్వ పన్ను వంటి పన్ను వనరుల బేస్‌ను విస్తరిస్తాం. ఆర్థిక వ్యవస్థ మరింత ఈక్వల్‌గా, న్యాయబద్ధంగా ఉండేందుకు కార్పొరేట్ టాక్స్ పెంచుతాం'' అని ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఐ వాగ్దానం చేసింది.


రిజర్వేషన్లపై..

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని, రిజర్వేషన్ల పరిమితిపై రాజకీయంగా, చట్టబద్ధంగా పార్టీ పోరాడుతుందని సీపీఐ వాగ్దానం చేసింది. డీలిమిటేషన్, జనగణన వంటి క్లాజ్‌లను తొలగించి తక్షణం మహిళా రిజర్వేషన్ల అమలుకు పోరాడతామని తెలిపింది. జాతీయ జనగణన ప్రక్రియను నిలిపివేసి, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం తగిన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని, కులగణన చేపడతామని వాగ్దానం చేసింది.

Narendra Modi: 'ఫ్లాప్ చిత్రం' రిపీట్.. రాహుల్, అఖిలేష్ జోడీపై మోదీ వ్యంగ్యోక్తులు


సీఏఏపై..

పౌరసత్వ (సవరణ) చట్టం రద్దు కోసం పనిచేస్తామని సీపీఐ వాగ్దానం చేసింది. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కింద కనీస వేతనాల పెంపు, క్యాలెండర్ ఇయర్‌లో వర్కింగ్ డేస్ 200 వరకూ పెంచేందుకు పోరాటం కొనసాగిస్తామని సీపీఐ తెలిపింది. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధిస్తామని వాగ్దానం చేసింది.


గవర్నర్ కార్యాలయం రద్దు..

కేంద్రం జోక్యానికి తావులేకుండా సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు గవర్నర్ కార్యాలయాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌పై సాగిస్తున్న పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీపీఐ వాగ్దానం చేసింది. ఎంటెన్స్ పరీక్షలు వంటి రాష్ట్రాల జాబితాల్లో వచ్చే అంశాల విషయంలో రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలే కీలక విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పిస్తామని తెలిపింది. నీతి ఆయోగ్ స్థానంలో తిరిగి ప్లానింగ్ కమిషన్ తెస్తామని సీపీఐ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఎన్‌సీఈఆర్‌టీ, ఇతర పాఠ్య పుస్తకాల్లో బీజేపీ తీసుకువచ్చిన అహేతక, మతపరమైన మార్పులను రద్దు చేస్తామని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)ని రద్దు చేసి, దేశవ్యాప్తంగా 'ప్రో-పీపుల్ మోడల్ ఆప్ ఎడ్యుకేషన్' తీసుకువస్తామని తెలిపింది. లౌకిక, ప్రజాస్వామిక, ప్రజానుకూల ప్రత్నామ్నాయంగా తమకు ఓటు వేసి పార్టీని బలపరచాలని సీపీఐ ఆ మేనిఫెస్టోలో దేశ ప్రజలను కోరింది. యావత్ దేశ ప్రజానీకం కలిసికట్టుగా బ్రిటిష్ రాజ్‌ను ఓడించినట్టే, దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, జీవినవిధానాన్ని పరిరక్షించేందుకు ఆర్ఎస్ఎస్-బీజేపీ రాజ్‌ను సమష్టిగా ఓడించేందుకు ఇదే తగిన తరుణమని పేర్కొంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 09:11 PM