Share News

Delhi: కేజ్రీవాల్ సీఎం పదవిపై పిటిషన్.. జేమ్స్‌బాండ్ ప్రస్తావన తెచ్చిన ఢిల్లీ హైకోర్టు.. ఎందుకంటే

ABN , Publish Date - Apr 10 , 2024 | 04:26 PM

దేశ రాజధాని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ పదే పదే పిటిషన్లు దాఖలు అవుతుండటంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.

Delhi: కేజ్రీవాల్ సీఎం పదవిపై పిటిషన్..  జేమ్స్‌బాండ్ ప్రస్తావన తెచ్చిన ఢిల్లీ హైకోర్టు.. ఎందుకంటే

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) అరెస్టు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ పదే పదే పిటిషన్లు దాఖలు అవుతుండటంపై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఈ పిటిషన్లపై ఇదివరకే సమాధానం ఇచ్చిందని తెలిపింది. ఇది సీక్వెల్‌లను కలిగి ఉండే జేమ్స్ బాండ్ చిత్రం కాదని.. ఈ విషయంలో "రిపీట్ లిటిగేషన్" ఉండకూడదని.. మళ్లీ మళ్లీ పిటిషన్‌లు దాఖలు చేయవద్దని స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. రాజకీయ చిక్కుముడిలోకి కోర్టును లాగాలని ప్రయత్నించి, వ్యవస్థను అపహాస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ పిటిషనర్ సందీప్ కుమార్‌‌పై రూ.50 వేల ఫైన్ విధించింది.

"సీక్వెళ్లు ఉండటానికి ఇది జేమ్స్ బాండ్ సినిమా కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ సమస్యను పరిష్కరిస్తారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు" అని కోర్టు పేర్కొంది. రాజధానిలో గవర్నర్ పాలన విధించలేమని జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం పునరుద్ఘాటించింది. మార్చి 28న అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను కోర్టు కొట్టివేసింది.


అరెస్టయిన ముఖ్యమంత్రి పదవిలో ఉండకుండా నిషేధించే చట్టాన్ని చూపడంలో పిటిషనర్ విఫలమవడంతో.. అలాంటి కేసుల్లో న్యాయపరమైన జోక్యానికి అవకాశం లేదని పేర్కొంది. అదే సమయంలో రాజధానిలో రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేసినట్లు ప్రకటించలేమని కూడా పేర్కొంది.

ఏప్రిల్ 4న, ఈ సమస్యపై రెండో పిటిషన్‌ని స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రిగా కొనసాగడం కేజ్రీవాల్ వ్యక్తిగత ఎంపిక అని, లెఫ్టినెంట్ గవర్నర్‌ని సంప్రదించడానికి పిటిషనర్‌కు ఆదేశాలిచ్చింది. కోర్టు విచారణ సమయంలో కుమార్ మాట్లాడుతూ.. మనీలాండరింగ్ కేసులో అరెస్టయినందున కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడానికి అనర్హుడని వాదించారు.

Delhi: యాపిల్ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా భారత్.. రూ.14 బిలయన్ డాలర్ల మార్కెట్‌కు చేరువ

న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ మాట్లాడుతూ.. ఫిర్యాదులు ఉంటే అదే అంశంపై మూడో పిటిషన్ దాఖలు చేయడానికి బదులుగా అంతకుముందు కోర్టు ఇచ్చిన తీర్పులపై అప్పీల్ దాఖలు చేయాలని సూచించింది.


పిటిషనర్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా లేకుంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా.. రాజకీయ ప్రసంగాలు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. "దయచేసి ఇక్కడ రాజకీయ ప్రసంగం చేయవద్దు. మీ క్లయింట్ రాజకీయ నాయకుడు కావచ్చు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడవచ్చు. కాని మేం కాదు. న్యాయవ్యవస్థకు రాజకీయాలు దూరంగా ఉంటాయి. దయచేసి రిపీట్ లిటిగేషన్‌తో తిరిగి రావద్దు’’ అని జస్టిస్ మన్మోహన్ హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 04:45 PM