Share News

Former CM: మండ్య నుంచి లోక్‌సభకు ‘కుమార’ సై.. రిసార్టులో పార్టీ నేతలతో రహస్య మంతనాలు

ABN , Publish Date - Jan 13 , 2024 | 01:04 PM

కేంద్రంలో మరోసారి బీజేపీకి అవకాశాలు ఉన్నాయనే సర్వేలతో కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ(BJP)తో జేడీఎస్‌ పొత్తుపెట్టుకున్న తరుణంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Former CM: మండ్య నుంచి లోక్‌సభకు ‘కుమార’ సై.. రిసార్టులో పార్టీ నేతలతో రహస్య మంతనాలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో మరోసారి బీజేపీకి అవకాశాలు ఉన్నాయనే సర్వేలతో కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ(BJP)తో జేడీఎస్‌ పొత్తుపెట్టుకున్న తరుణంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చలు సాగిన నేపథ్యంలోనే కేంద్రంలో మంత్రిని చేస్తామని కుమారస్వామికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లో జేడీఎస్‌(JDS) మూడు లేదా నాలుగింటికి మాత్రమే పరిమితమై మిగిలిన అన్ని చోట్లా బీజేపీకి మద్దతు ఇవ్వాలని దాదాపు తీర్మానించినట్లు తెలుస్తోంది. వీటిలో హాసన్‌, మండ్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. మండ్య లోక్‌సభ స్థానం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా కుమారస్వామి రంగంలోకి దిగే అవకాశంపై రెండురోజులుగా కసరత్తు సాగుతోంది. చిక్కమగళూరు జిల్లాలోని ఓ రిసార్టులో మండ్య(Mandya) జిల్లాలోని అన్ని శానససభ నియోజకవర్గాల ముఖ్యనేతలతో చర్చలు జరిపారు. 2019 ఎన్నికల పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మండ్య నుంచి ప్రస్తుతం సుమలత(Sumalata) ఇండిపెండెంట్‌ ఎంపీగా ఉన్నారు. ఇటీవలే ఆమె బీజేపీకి మద్దతు ప్రకటించారు. వాస్తవానికి రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సుమలత రంగంలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ- జేడీఎస్(BJP-JDS) మధ్య పొత్తుతో మండ్య స్థానం జేడీఎస్‌ నేతలు నిర్ణయించిన వారికే టికెట్‌ దక్కనుంది.

pandu6.2.jpg

అదే జరిగితే సుమలత కాంగ్రెస్‏లో చేరి అభ్యర్థి అవుతారా లేదా గతంలో మాదిరిగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అనేది కీలకం కానుంది. ఇటీవల సుమలత పోటీ చేస్తే మండ్య మినహా మరో చోటుకు వెళ్లేది లేదని బహిరంగ ప్రకటన చేసిన అంశం కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థి మీరే అయితే వందశాతం కలిసి పనిచేద్దామని, పార్టీలో విభేదాలు, గ్రూపులు లేకుండా ముందుకెళదామని తాలూకా స్థాయి నాయకులు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కుమారస్వామి(Kumaraswamy) ఓ అడుగు ముందుకేసి సుమలతను కలుస్తానని అందులో తప్పేమిటని చేసిన ప్రకటన మండ్య పరిధిలో ఏవిధంగా పనిచేసిందనే అంశంపైనా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా బీజేపీ నేతలకు వదిలేసి జాతీయ రాజకీయాల వైపు వెళ్లడం ద్వారా కేంద్రంలో మంత్రిగా కొనసాగవచ్చునని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత కుమారస్వామి ఢిల్లీ వెళ్లి సీట్ల అంశాన్ని కొలిక్కి తీసుకువచ్చిన వెంటనే మండ్య నుంచి పోటీ చేసే విషయాన్ని ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Updated Date - Jan 13 , 2024 | 01:04 PM