Share News

Delhi: అద్భుతం చేసిన ఢిల్లీ వైద్యులు.. ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి సర్జరీ ద్వారా..

ABN , Publish Date - Mar 06 , 2024 | 02:00 PM

ఆధునిక యుగంలో వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలకే సరైన చికత్స అందించే వైద్యులు లేక, సరైన మందులు లేక ప్రాణాలు పోయేవి. కానీ ప్రస్తుతం ఆధునిక యుగంలో వైద్యరంగంలో చాలా మార్పులు వచ్చాయి.

Delhi: అద్భుతం చేసిన ఢిల్లీ వైద్యులు.. ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి సర్జరీ ద్వారా..

ఢిల్లీ: ఆధునిక యుగంలో వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలకే సరైన చికత్స అందించే వైద్యులు లేక, సరైన మందులు లేక ప్రాణాలు పోయేవి. కానీ ప్రస్తుతం ఆధునిక యుగంలో వైద్యరంగంలో చాలా మార్పులు వచ్చాయి. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు వైద్యులు. ఎన్నో అరుదైన వ్యాధులకు మందులు తీసుకొచ్చి లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో లేదా అనారోగ్యం కారణంగా అవయవాలు కోల్పోయిన వారికి సైతం ఆర్గాన్స్ మార్పిడి ద్వారా ప్రాణాలు నిలబెడుతున్నారు. గుండె మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేసి పలువురి ప్రాణాలను కాపాడారు. వైద్యుల గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కరోనా వంటి విపత్కర కాలంలో వైద్యులు చేసిన సేవ చరిత్రలో నిలిచిపోయింది. తాజాగా వైద్యులు మరో అద్భుతం చేశారు. ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి తిరిగి చేతులు తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ చేతులను సదరు వ్యక్తికి విజయవంతంగా అతికించారు. ఈ శస్త్ర చికిత్స జరిగింది ఎక్కడో కాదు మనదేశంలోనే. మన దేశ రాజధానిలోని ఢిల్లీలో గల సర్ గంగా రామ్ హాస్పిటల్ వైద్యులు ఈ అద్భుతం చేశారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో నివసించే 45 ఏళ్ల వ్యక్తి 2020లో జరిగిన రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన సదరు వ్యక్తి తన జీవితంపై ఆశలు వదులుకున్నాడు. అయితే ఇటీవల దక్షిణ ఢిల్లీ పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా హెహతా బ్రెయిన్ డెడ్‌ అయ్యారు. తాను మరణించిన తర్వాత తన అవయవాలను దానం చేయాలని ఆమె బతికుండగానే నిర్ణయించుకుంది. మీనా మెహతా నిర్ణయం 45 ఏళ్ల వ్యక్తికి వరంగా మారింది. మీనా మెహతా చేతులు 45 ఏళ్ల వ్యక్తికి సరిగ్గా సరిపోయాయి. దీంతో ఆమె చేతులను విజయవంతంగా అతనికి అమర్చారు. ఈ ఘటనలో వైద్యుల కృషిని కొనియాడకుండా ఉండలేం. 12 గంటలకుపైగా శస్త్ర చికిత్స చేసి దాత చేతులను విజయవంతంగా గ్రహీతకు అమర్చారు. ధమని, కండరం, స్నాయువు, నరాలను అనుసంధానించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో 45 ఏళ్ల వ్యక్తి తిరిగి తన చేతులను పొందాడు. రెండు చేతులు మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేయడం ఢిల్లీలో ఇదే మొదటిసారి.

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్న 45 ఏళ్ల వ్యక్తి గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా కాబోతున్నాడు. శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిన అనంతరం ఆపరేషన్ చేసిన వైద్యులంతా పేషెంట్‌తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఢిల్లీ వైద్యులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా బతికుండగానే మీనా మెహతా తీసుకున్న నిర్ణయం 45 ఏళ్ల వ్యక్తివే కాకుండా మరో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడింది. ఆమె కాలేయం, మూత్రపిండాలు, కార్నియాలను కూడా వైద్యులు మరో ముగ్గురికి విజవంతంగా అమర్చారు. మొత్తంగా మీనా మెహతా అవయవ దానం కారణంగా నలుగురు వ్యక్తులు తమ జీవితాలను తిరిగిపొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Untitled-1.jpg

Updated Date - Mar 06 , 2024 | 02:01 PM