Share News

Fire Accident: గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

ABN , Publish Date - May 26 , 2024 | 05:57 AM

అక్కడికి సరదాగా కాసేపు ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు గానీ.. వారు ఆడుకుంటుంటే చూస్తూ ముచ్చట పడుతున్న తల్లిదండ్రులు గానీ కాసేపట్లో చుట్టుముట్టే మంటల్లో చిక్కుకొని సజీవదహనం అవుతామని ఊహించలేకపోయారు! కంప్యూటర్‌ గేమ్స్‌లో కొందరు.. జారుడు బల్లాటలో ఇంకొందరు.. ఆడుతూనే అనంత లోకాలకు చేరారు.

 Fire Accident: గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
fire accident at game zone

27 మంది సజీవ దహనం

మృతుల్లో సగానికి పైగా పిల్లలు.. ఘటన సమయంలో లోపల 60 మంది.. 20 మంది క్షేమం

గేమ్‌జోన్‌ పూర్తిగా కలపతో నిర్మాణం..

వేగంగా వ్యాప్తిచెందిన మంటలు

అనుమతి లేకుండా జోన్‌ నిర్వహణ

మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం

ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

రాజ్‌కోట్‌, మే 25: అక్కడికి సరదాగా కాసేపు ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు గానీ.. వారు ఆడుకుంటుంటే చూస్తూ ముచ్చట పడుతున్న తల్లిదండ్రులు గానీ కాసేపట్లో చుట్టుముట్టే మంటల్లో చిక్కుకొని సజీవదహనమవుతామని ఊహించలేకపోయారు! కంప్యూటర్‌ గేమ్స్‌లో కొందరు.. జారుడు బల్లాటలో ఇంకొందరు.. బొమ్మ కార్లలో తిరుగుతూ మరికొందరు.. ఇలా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పిల్లలు, వారి సంబంధీకులున్న గేమ్‌జోన్‌ను మాయదారి అగ్నికీలలు చుట్టుముట్టాయి. అక్కడున్నవారంతా ప్రాణభయంతో తప్పించుకునేందుకు పరుగులు పెట్టినా అప్పటికే వ్యాపించిన దట్టమైన పొగ.. మంటల్లో చిక్కుకుపోయి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో సగానికి పైగా పిల్లలున్నారు. టీఆర్పీ పేరుతో నిర్వహిస్తున్న ఓ మాల్‌లోని గేమింగ్‌ జోన్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు గేమింగ్‌ జోన్‌ లోపల 60మందిదాకా ఉన్నారు. 20 మందిని అధికారులు రక్షించారు. ఇంకా కొందరు లోపలే ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈగేమింగ్‌ జోన్‌ను పూర్తిగా కలపతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించి అక్కడున్నవారు తప్పించుకునేందుకు వీల్లేకుండాపోయిందని.. ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెప్పారు. గేమింగ్‌ జోన్‌కు మంటలు వ్యాపించడం..


లోపల పిల్లలు చిక్కుకుపోవడంతో బయట ఉన్న తల్లిదండ్రులు రక్షించండంటూ కేకలు వేశారు. కళ్లముందే పిల్లలు మంటల్లో చిక్కుకుపోవడంతో కంటికీమంటికి ఽధారగా రోదించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈ గేమ్‌జోన్‌ నిర్వహణకు ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. దాని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కోట్‌ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ప్రమాద ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర సీఎం పటేల్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు.



Read
National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 07:06 AM