Share News

Lok Sabha Elections: హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు.. సూర్జేవాలాకు ఈసీ నోటీసు

ABN , Publish Date - Apr 09 , 2024 | 08:32 PM

బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్ర 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.

Lok Sabha Elections: హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు.. సూర్జేవాలాకు ఈసీ నోటీసు

న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని (Hema Malini)ని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా (Randeep Surjewala)కు ఎన్నికల కమిషన్ (Election Commission) షోకాజ్ నోటీసు (Show cause notice) పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్ర 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. అన్ని పార్టీల నేతలు పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు మహిళల గౌరవాన్ని కించపరచరాదంటూ ఈసీ ఇచ్చిన సూచనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా ఈసీ కోరింది. 12వ తేదీ సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని అడిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న హేమమాలిని 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి మధుర నుంచే పోటీలో ఉన్నారు.


వీడియోలో ఏముంది?

హేమమాలినిపై సూర్జేవాలా 'సెక్సిస్ట్' వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తున్న ఒక వీడియోను ఈనెల 3వతేదీన బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ షేర్ చేశారు. ''ధర్మేంద్రను పెళ్లి చేసుకున్న హేమమాలిని అంటే మాకు గౌరవం ఉంది, ఆమె మన కోడలు కూడా. అయితే వీళ్లు ఫిల్మ్ స్టార్‌లు. కానీ మేము వారిలా కాదు. మీరు నన్ను కానీ లేదా గుప్తాజీని కానీ ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేము మీకు సేవలందిస్తాం'' అని సూర్జేవాలా పేర్కొన్నట్టు బీజేపీ విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. దీనిపై హేమమాలిని సైతం స్పందించారు. ''ప్రముఖులను మాత్రమే వాళ్లు టార్గెట్ చేస్తుంటారు. పాపులారిటీ లేనివారి గురించి మాట్లాడితే వాళ్లకు ఒరిగేదేముంటుంది? ఇలాంటి వాళ్లు మహిళలను ఎలా గౌరవించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాలి'' అని అన్నారు.

Delhi Liquor Case: కేజ్రీవాల్ జైలులోనే...హైకోర్టులో దక్కని ఊరట


వీడియో విశ్వసనీయతను నిలదీసిన సూర్జేవాలా

కాగా, బీజేపీ విడుదల చేసిన వీడియో విశ్వసనీయతను సూర్జేవాలా ప్రశ్నించారు. అది వక్రీకరణలతో నిండిన ఎడిట్ చేసిన వీడియో అని వివరణ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం యువకులు, రైతులు, పేదలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాల నుంచి ప్రజలను దారిమళ్లించేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వీడియోలను బీజేపీ ఐటీ సెల్ షేర్ చేస్తోందని తప్పుపట్టారు. ఎడిటింగ్, వక్రీకరణలతో నకిలీ వీడియోలు తయారుచేయడం ఆ పార్టీ ఐటీ సెల్ అలవాటుగా మారిందన్నారు. ''పూర్తి వీడియో వినండి. ధర్మేంద్రను వివాహం చేసుకున్నందుకు, మా కోడలైనందుకు మాకు కూడా హేమమాలిని అంటే చాలా గౌరవం ఉందని మాత్రమే నేను చెప్పాను'' అని సూర్జేవాలా మరింత వివరణ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 08:39 PM