DK Shivakumar: పెన్ డ్రైవ్‌ల వెనుక ఉన్నది కుమారస్వామే: డీకే సంచలన ఆరోపణ
ABN , Publish Date - May 08 , 2024 | 06:22 PM
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ల వెనుక ఉన్నది కుమారస్వామేనని, వ్యక్తుల రాజకీయ జీవితాన్ని అంతం చేయడం, బ్లాక్‌మెయిలింగ్ చేయడంలో ఆయన కింగ్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
![DK Shivakumar: పెన్ డ్రైవ్‌ల వెనుక ఉన్నది కుమారస్వామే: డీకే సంచలన ఆరోపణ](https://media.andhrajyothy.com/media/2024/20240504/dk_71a22ebdd2.jpg)
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ వెలుగుచూసిన ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతకర వీడియోల వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. పెన్‌డ్రైవ్‌లో వందలాది వీడియోలు బయటపడటం, వీడియోల లీక్ వెనుక భారీ కుట్ర జరిగందంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఆరోపణలు చేయడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivkumar) ఘాటుగా స్పందించారు. పెన్ డ్రైవ్‌ల వెనుక ఉన్నది కుమారస్వామేనని, వ్యక్తుల రాజకీయ జీవితాన్ని అంతం చేయడం, బ్లాక్‌మెయిలింగ్ చేయడంలో ఆయన కింగ్ అని ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లు విడుదల చేయడం వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని కుమారస్వామి మంగళవారంనాడు ఆరోపించారు. దీనిపై డీకే తాజాగా స్పందిస్తూ, కుమారస్వామి 'బ్లాక్‌మెయిలింగ్ కింగ్' అని ఎద్దేవా చేశారు.
Kidnaping case: ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు జ్యుడిషియల్ కస్టడీ
లీడ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయనే...
ఈ కథకు లీడ్, దర్శకుడు, నిర్మాత కుమారస్వామేనని, పెన్ డ్రైవ్‌ల వ్యవహారం ఆయనకు బాగా తెలుసునని డీకే చెప్పారు. ఒకరి వెంట మరొకరి రాజకీయ జీవితానికి పాడె కట్టడం ఆయన పని అని ఆరోపించారు. అధికారులు, రాజకీయనాయకులతో సహా ప్రతి ఒక్కరిని ఆయన బెదిరిస్తుంటారని, బ్లాక్‌మెయిలింగ్ కింగ్ అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఇవన్నీ చర్చకు వస్తాయని, అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించేందుకు తాము సిద్ధమని డీకే తెలిపారు. 'సిట్' అంటే శివకుమార్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిద్ధరామయ్య ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటూ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై డీకే కొట్టివేశారు. పెన్ డ్రైవ్‌ల వ్యవహారం వెనుక కర్త, కర్మ, క్రియ ఆయనేనని, ఆయన ఏమిటనేది తమకు బాగా తెలుసునని చెప్పారు.
Read Latest National News and Telugu News